04-07-2025 12:35:52 AM
రతన్ రుద్ర :
నేడు దొడ్డి కొమురయ్య వర్ధంతి :
* కొమురయ్య మరణం యావత్ తెలంగాణ ప్రాంతంలో పోరాట జ్వాలను రగిలించింది. ఆ పోరాటం సాయుధ పోరాటం లో రెండో దశ అని చెప్పవచ్చు. కడివెండిలో మొదలైన నిరసన సెగ పక్కనే ఉన్న ధర్మారం, మొండ్రాయి, పాలకుర్తి ప్రాంతాలకు వ్యాపించింది. కొమురయ్య మరణం తర్వాత అప్పటి కమ్యూనిస్టులు ఇక సాయుధ పోరాటమే శరణ్యమని భావించారు.
భారతదేశంలో ఎన్నో పోరాటా లు జరిగాయి. బడుగులపై ఎక్కడ ఆధిపత్యం రాజ్యమేలిందో అక్కడ ఉద్యమాలు పుట్టాయి. వాటిలో కొన్నిపోరాటాలు సుదీర్ఘకాలం కొనసాగాయి. అలాంటి పోరాటాల్లో 1940ల ప్రాంతం లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన సాయుధ పోరాటం ఒకటి. భూమి కోసం.. భుక్తి కోసం..బానిస సంకెళ్ల విముక్తి కోసం.. జరిగిన ఈ పోరాటంలో 4 వేల మంది ప్రజలు, ఉద్యమకారులు అమరులయ్యా రు.
నైజాం ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్న జాగీర్‌దార్లు, దేశ్‌ముఖ్‌లు, భూస్వాములు, దొరల పీచమణిచేందుకు వారు ప్రాణాలను ఫణంగా పెట్టారు. అం తటి మహత్తరమైన పోరాటానికి స్ఫూర్తినిచ్చిన యోధుడే దొడ్డి కొమురయ్య. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో తెలంగాణ ప్రాంతం నివురు గప్పిన నిప్పు లా ఉండేది. నిజాం తొత్తు అయిన విసునూర్ దేశ్‌ముఖ్ రాపాక రామచంద్రారెడ్డి అనే కరుడు గట్టిన భూస్వామి చేతుల్లో మొత్తం 60 గ్రామాలు ఉండేవి.
రామచంద్రారెడ్డి తన తల్లి జానకమ్మతో కలిసి ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డాడు. ఆ ప్రాంతానికి ఆమె దొరసాని జానకమ్మ. కానీ, ఆమె తనను దొర అని పిలవాలని హుకుం జారీ చేసింది. ఆమె మాటను తనయుడు రామచంద్రారెడ్డి శిలాశాసనంలా భావించి అమ లు చేశాడు. నిజాంకు శిస్తు కట్టాలన్న నెపం తో ప్రజలను పీడించేవాడు. వెట్టిచాకిరీ సమస్య దారుణంగా ఉండేది. కింది కులాలకు చెందిన వారు దేశ్‌ముఖ్‌లు, దేశ్‌ము ఖ్‌ల ఇండ్లలో బానిసల్లా పనిచేశారు.
ఒకవేళ వారి ఇంట శుభకార్యాలు జరిగితే, శూ ద్రులు, దళితులు వారికి సేవలందించేవారు. ఉదాహరణకు గొల్ల కురుమలు జీవాలనిచ్చేవారు. మాదిగలు చెప్పులు కుట్టి అందించేవారు. కంసాలులు ఆభరణాలు ఇచ్చేవారు. మాంసం, కూరగాయ లు.. ఇలా చెప్పుకొంటూ పోతే దాదాపు గ్రామస్తులందరూ ఏదో ఒక విధంగా ఏదో ఒక సేవ అందించాల్సిందే. ముఖ్యంగా దళితుల దుస్థితి మరింత అధ్వానంగా ఉండే ది.
దేశ్‌ముఖ్‌లు, జాగీర్‌దార్లు, దొరల ఇంట్లో ఆడబిడ్డల పెళ్లి జరిగితే.. ఆమెకు అత్తవారింట సేవలందించేందుకు ప్రత్యేకంగా కింది కులానికి చెందిన ఓ మహిళ ను సేవకురాలిగా పంపించేవారు. ప్రజల నుంచి వివక్ష, బానిసత్వ సంకెళ్ల నుంచి విడిపించేందుకు 1920ల ప్రాంతంలో మొద టిసారి హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్ర జనసం ఘం ఏర్పాటైంది.
మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, ముం దుముల నరసింగారావు, ఆదిరాజు వీరభద్రరావు తదితరులు సభ్యులయ్యారు. వీరు గ్రామాల్లో వెట్టి చాకిరీ నిర్మూలనకు ఎంతో కృషి చేశారు. ఆ సంఘమే 1930ల ప్రాంతంలో ఆంధ్ర మహాసభగా మారింది. వారి పోరాటాన్ని సాయుధ పోరాటానికి తొలి దశ అని చెప్పవచ్చు.
జానకమ్మ అకృత్యాలు..
జానకమ్మ పన్ను చెల్లించని వారి ఇండ్లపై గూండాలను పంపించేది. ఆ గూం డాలు పేద ప్రజల ఇళ్లపై పడి దోపిడీకి పాల్పడేవారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు తెగబడేవారు. దేశ్‌ముఖ్ కనుసన్నల్లో అలాంటి దుర్మార్గాలు సాగేవి. ఆ దేశ్‌ము ఖ్ కబంధ హస్తాల్లోనే దొడ్డికొమురయ్య స్వగ్రామమైన వరంగల్ జిల్లా జనగాం తాలుకాలోని కడివెండి కూడా ఉంది. దేశ్‌ముఖ్ అకృత్యాలు, అఘాయిత్యాలను నాటి ఆంధ్రమహాసభ తీవ్రంగా పరిగణించింది.
నాటి కమ్యూనిస్టు పార్టీ నేతలు నల్లా నర్సింహులు, చకిల యాదగిరి, మందడి మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామా ల్లో గుతపల సంఘాలు ఏర్పడ్డాయి. ఆ ఆంధ్రమహాసభనే అప్పటి ప్రజలు ‘సంఘం’ అని పిలుచుకునేవారు. కమ్యూనిస్టుల నేతృత్వంలో ఏర్పడిన ఈ సంఘం లో నాడు వేలాదిగా గ్రామస్తులు సభ్యులుగా చేరారు. దీనిలో భాగంగానే కడివెం డి గ్రామస్తులు కూడా సంఘంలో చేరారు. అలా చేరిన వారిలో దొడ్డి కొమురయ్య కుటుంబం కూడా ఉంది.
సంఘం సభ్యు లు కడివెండి గ్రామంలో గ్రామ రక్షణ దళా న్ని ఏర్పాటు చేసుకున్నారు. జానకమ్మ పురమాయించిన గుండాలు గ్రామాలకు వెళ్లేవారు. అదే క్రమంలో ఆ గూండాలు కడివెండికీ వెళ్లేవారు. గ్రామస్తుల చేతిలో చావుదెబ్బలు తిని వెనక్కి వచ్చేవారు. ఈ క్రమంలో కొమురయ్య తన సోదరుడు మల్లయ్యతో కలిసి గ్రామస్తులను ఏకం చేశాడు. దేశ్‌ముఖ్‌కు ఎవరూ శిస్తు చెల్లించవద్దని, వారి ఇంటికి గొర్రెలను ఇతర జీవాలను పంపించవద్దని చైతన్యపరిచా డు.
గొల్ల, కురుమల నాయకుడిగా ఎదిగా డు. ఈ క్రమంలో కొమురయ్యను మట్టుపెట్టాలని దేశ్‌ముఖ్, అతని గూండాలు పథకం పన్నారు.1946 జూలై 4న సంఘం ఆధ్వర్యంలో కడివెండి గ్రామస్తులు గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తుండగా గూం డాలు ఎలాంటి హెచ్చరికలు లేకుండా తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు.
కాల్పుల్లో కొమురయ్య కడుపులో తూటా దూసుకొచ్చింది. కొమురయ్య నినాదాలు చేస్తూ నేలకొరిగి ప్రాణాలు వదిలాడు. ఇదే కాల్పుల్లో అతడి సోదరుడు మల్లయ్య కాలయ్య కాలిలో తూటా దిగింది. సంఘం సభ్యులు మంగళి కొండయ్య, దొడ్డి నరసయ్య క్షతగాత్రులయ్యారు.
పత్రికలో మరణవార్త..
దొడ్డి కొమురయ్య మరణవార్త మర్నా డు నాటి మీజాన్ పత్రికలో ప్రచురితమైం ది. ఆ నోటా ఈ నోటా వార్త పడి దావానలంలా తెలంగాణ ప్రాంతమంతా వ్యాపిం చింది. కొమురయ్య మరణం యావత్ తెలంగాణ ప్రాంతంలో పోరాట జ్వాలను రగిలించింది. ఆ పోరాటం సాయుధ పోరాటంలో రెండో దశ అని చెప్పవచ్చు. కడివెండిలో మొదలైన నిరసన సెగ పక్కనే ఉన్న ధర్మారం, మొండ్రాయి, పాలకుర్తి ప్రాంతాలకు వ్యాపించింది.
కొమురయ్య మరణం తర్వాత అప్పటి కమ్యూనిస్టులు ఇక సాయుధ పోరాటమే శరణ్యమని భావించారు. ప్రజలను ప్రత్యక్ష పోరాటా ల్లో భాగస్వాములను చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఆంధ్ర మహాసభను యావ త్ తెలంగాణ ప్రాంతానికి విస్తరించారు. ప్రతి గ్రామంలో గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేశారు. మహిళలు, యువకుల కు గెరిల్లా పోరాట తరహా శిక్షణ ఇచ్చారు.
హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతున్న నాటి విద్యార్థులు పానుగంటి సీతారామారావు, అనిరెడ్డి రామిరెడ్డి మరికొంత మంది విద్యార్థులను కూడగట్టి సాయుధపోరాటంలో భాగస్వాములయ్యారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన యువకులంతా ఒక్కటయ్యారు. దీంతో ‘దొరా.. బాంచన్ కాల్మొక్కుతా..’ అని రోజు లు పోయి ‘దున్నే వానిదే భూమి’ అనే రోజులు వచ్చాయి. అప్పుడు మొదలైన పోరాటం 1951 వరకు వీరోచిత పోరాటం చేశారు.
- వ్యాసకర్త సెల్: 78421 95755