17-09-2025 01:51:57 AM
తెలంగాణ ఆర్థిక ఇంజిన్ హైదరాబాద్‌ను కుప్పకూల్చేస్తున్నారు
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో విజయం సాధించి బీఆర్‌ఎస్ జైత్రయాత్రను తిరిగి ప్రారంభిస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో, ఆ పార్టీ అవలంబించిన విధానాలపై తెలంగాణ ప్రజా నీకమంతా గుర్రుగా ఉన్నారని పేర్కొన్నారు.
హైదరాబాద్‌ను తెలంగాణ ఆర్థిక ఇంజిన్‌గా మార్చిన గత పదేళ్ల తమ ప్రభుత్వ పాలనకు భిన్నంగా, కాంగ్రెస్ పార్టీ విధానాలు ఉన్నాయని, నగరాన్ని పూర్తిగా కుప్పకూల్చేలా చేస్తున్నారని, ఈ విషయాన్ని నగర ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీ నేతలతో మంగళ వారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఉపఎన్ని కలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ సీనియర్ నేతలతో చర్చించారు.
పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేసి, జూబ్లీహిల్స్ నుంచి బీఆర్‌ఎస్‌కు విజయం లభించేలా కృషి చేయాలని పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాల్సిందేనని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్‌రెడ్డి సృష్టించిన భయం తో హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, అన్ని రంగాలపై కాంగ్రెస్ అసమర్థ విధానాల ప్రతికూల ప్రభావం తీవ్రంగా ఉందని కేటీఆర్ గుర్తుచేశారు.
మళ్లీ దీపావళి వచ్చింది.. బాంబులు ఏమైనయ్?
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. భద్రాచలం నియోజకవర్గగానికి సంబంధించి మంగళవారం తెలంగాణ భవన్‌లో ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం నిర్వహించారు. ‘గత దీపావళికి బాంబులు పేలుతాయని కొందరు వ్యాఖ్యానించారు. మళ్లీ దీపావళి వచ్చింది.. ఆ బాంబులు ఏమైనాయి. తంతే గారెలు బుట్టలో పడట్టు మంత్రైన పొంగులేటి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు.
ప్రజాస్వామ్యంలో అహంకారంతో ఎగిరితే తిప్పికొ డుతారు. పాలేరులో ఆయన మళ్లీ ఎలా గెలుస్తారో చూద్దాం. ఏడాది కింద పొంగులేటి ఇంటిపై జరిగిన దాడుల విషయంలో కేంద్రం గానీ, ఆయన గానీ ఎందుకు మాట్లాడటం లేదు’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఆ దాడుల్లో దొరికిన డబ్బులెన్నో ఎవరూ చెప్పడం లేదని, పొంగులేటి బీజేపీతో కుమ్మక్కయ్యారా? లేదా బీజేపీతో కుమ్మక్కైనా రేవంత్‌రెడ్డితో కలిసి పోయాడా? అని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. సీబీఐ సహా వంద కేంద్ర సంస్థలతో, బీజేపీతో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కైందని కేటీఆర్ ఆరోపించారు. బతికనంతకాలం ధైర్యంగా బతకాలని, కానీ ఇంత నీఛమైన కుమ్మక్కు రాజకీయాలు ఎందుకని నిలదీశారు.