04-07-2025 12:39:32 AM
బొడ్డు నర్సింహారావు :
తాము టెలికాం డిపార్ట్‌మెంట్ లో పనిచేస్తున్నానని చెప్పి కొందరు కాలర్స్ ‘మీ ఆధార్ కార్డుతో ఎవ రో కొత్త సిమ్ తీసుకున్నారు. ఆ సిమ్ హోల్డ్ కేసు నమోదైంది’ అంటున్నారు. తర్వాత ఓ నగరంలో సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ పేరుతో వాట్సాప్ సందేశాలు పంపుతున్నారు. నకిలీ ఐపీఎస్ అధికారుల అవతారం ఎత్తి గంభీరంగా మాట్లాడుతూ.. ‘మీరు మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారు.
ఓ కేసుకు సంబంధించిన దర్యా ప్తులో భాగంగా ఓ ఇంట్లో తనిఖీ చేస్తుండగా మీ పేరుతో ఉన్న బ్యాంక్ అకౌంట్, డెబిట్ కార్డు దొరికింది. ఈ కేసులో శిక్ష పడుతుంది’ అని బెదిరిస్తున్నారు. ఆ కేసు కు సంబంధించిన ఫేక్ పత్రాలు సృష్టించి వాట్సప్ చేస్తున్నారు. దీంతో బాధితులు భయపడి వణికిపోతారు. అనంతరం పోలీ సు దుస్తుల్లో ఒకరు ఒక వీడియోకాల్ చేస్తారు. ‘మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తు న్నాం’ అని చెప్తారు.
ఇంట్లో నుంచి ఎక్కడికీ వెళ్లొద్దని చెప్పి.. పరిశీలన కోసం ఖాతా ల్లో ఉన్న డబ్బును వేర్వేరు ఖాతాల్లోకి బదిలీ చేయాలని బెదిరిస్తారు. దీంతో బాధితులు వారు సూచించిన ఖాతాల్లోకి డబ్బు మళ్లిస్తారు. ఇలా సైబర్ నేరగాళ్లు కొత్త పంథా అనుసరిస్తున్నారు.
కేసుల్లో ఇరుక్కున్నారంటూ నమ్మించి వారిని భయం, ఒత్తిడికి గురిచేస్తున్నారు. దాన్ని ఆసరాగా తీసుకుని ఆ తర్వాత డబ్బులు దండుకుంటున్నారు. మరికొందరు నేరగాళ్లు వాట్సాప్‌లో ఏపీకే లింక్స్ వైరల్ చేసి, అవి ఓపెన్ చేసిన వారి బ్యాంక్ ఖాతాలు ఆపరేట్ చేస్తున్నారు. ఖాతాల్లో ఒక్కపైసా అయినా మిగల్చకుండా కొల్లగొడుతున్నారు.
పెట్టుబడుల పేరుతో లింక్‌లు..
ఈ మధ్య కొందరి మొబైల్‌లో వాట్సాప్‌కు పెట్టుబడులకు సంబంధించిన సం దేశాలు వస్తున్నాయి. తాము చెప్పిన సంస్థ ల్లో పెట్టుబడులు పెడితే సాయంత్రానికల్లా భారీగా లాభాలు వస్తాయన్నది ఆ మెసేజ్‌ల సారాంశం. అది నమ్మిన కొందరు వారు చెప్పిన ఖాతాల్లో డబ్బువేసి పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టారు. తొలుత భారీగా లాభాలు వచ్చినట్లు కనిపించేది. కానీ డ్రా చేసుకోవాలంటే మాత్రం నిర్వాహకులు అంగీకరించడం లేదు.
కొద్దిరో జులు ఆగాలని, ఇంకా లాభాలు వస్తాయ ని నమ్మబలుకుతున్నారు. గట్టిగా అడిగితే రకరకాల రుసుములు చెల్లించాలని వేధించేవారు. చివరకు వారందరికీ అర్థమైంది ఏమిటంటే.. తాము మోసపోయామని తర్వాత తెలుసుకున్నారు. ఆ సైబర్ నేరగా ళ్లు ఎవరో తెలీదు. ఎక్కడుంటారో తెలీదు. ఒక మెసేజ్‌తోనే.. ఓ ఓటీపీతోనో.. ఓ క్లిక్‌తోనో మన డబ్బు కొల్లగొడుతున్నారు.
డిజటల్ నేరాలు..
ఉదాహరణకు మీ పేరుతో ఉన్న సిమ్ ఆధారంగా మనీలాండరింగ్ నేరంలో ఇరుక్కున్నారని ఒక ఫేక్ ఫోన్ వస్తుంది. ఈడీ కేసులో ముంబయి కోర్టు మీపై వారెంట్ జారీ చేసిందని చెబుతారు. మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారని.. మాకు తెలియకుండా ఇంటి బయటికి వెళ్లొద్దని హెచ్చరిస్తారు. వాట్సప్ లేదా స్కైప్ వీడియోకాల్ ద్వారా పోలీస్ దుస్తుల్లో ఉన్న వ్యక్తి లైన్లోకి వస్తా డు.
మీకు నేరంతో సంబంధంలేదని నిరూపించుకునేందుకు మీ బ్యాంకు ఖాతాల్లోని సొమ్ము, ఎఫ్‌డీలు, ఎల్‌ఐసీ బాండ్లు.. ఇలా అన్నింటినీ ముందుగా ఆర్బీఐ ఏర్పాటు చేసిన ఖాతాలోకి మళ్లించాలని ఒత్తిడి చేస్తారు. మొత్తం ఊడ్చేసిన తర్వాత ఒకట్రెండు రోజుల్లో దర్యాప్తు పూర్తవుతుంద ని.. తర్వాత మీ సొమ్ము తిరిగి మీ ఖాతాకు బదిలీ అవుతుందని చెప్పి జారుకుంటారు.
బ్యాంకు కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నామని చెబుతూ బిల్లు చెల్లింపులో జరి గిన పొరపాటు కారణంగా కార్డు బ్లాక్ చేస్తున్నామని బెదిరిస్తారు. అలా ఎందుకు చేస్తున్నారని అడిగితే తమకు వచ్చిన ఆదేశాలు అలా ఉన్నాయంటారు. ఇప్పుడేం చేయాలని అడగ్గానే పూర్తి వివరాలు ఇస్తే తమ పై అధికారులతో మాట్లాడి విషయం పరిష్కరిస్తామంటూ పిన్ నంబర్ సహా ఖాతాదారుడితోనే చెప్పిస్తారు. వాటి ఆధారంగా కార్డులోఉన్న నగదంతా దోచేస్తారు.
క్రెడిట్ లిమిట్ పెంపు అబద్ధం..
మనకు ఎవరైనా కాల్ చేసి డెబిట్ కార్డు, క్రెడిట్‌కు సంబంధించిన సీవీవీ నెం బర్ అడిగారంటేనే అది దొంగల పని అని అర్థం చేసుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ కార్డు వివరాలేవీ ఎవరికీ చెప్పొద్దు. తక్కువ ధరకే రకరకాల వస్తువులు అమ్ముతామని ఆన్లైన్ వేదికగా కుప్పలుతెప్పలుగా ప్రకటనలు వచ్చిపడుతున్నాయి. వాటిలో ధర తక్కువ... ఇంటికే డెలివరీ అని ఊరిస్తారు. దానికి ఆశపడి డబ్బు చెల్లించారో.. ఒక్కోసారి అసలు సరుకే రాదు.
లేదా పార్సిల్ లో చిత్తు కాగితాలేవో పెట్టి పంపుతారు. జరిగిన మోసం గురించి చెబుదామంటే ప్రకటనలోని నంబర్ పనిచేయదు. ఫిర్యా దు చేసినా ప్రయోజనం ఉండదు. సైబర్ నేరగాళ్ల కొత్త పంథా వాయిస్ క్లోనింగ్. కృత్రిమ మేధ సాయంతో ఎవరి గొంతునైనా సృష్టిస్తున్నారు. నకిలీ స్వరం పుట్టించి ఆయన కింద పనిచేసే ఉద్యోగుల కాల్ చేసి, వారి నుంచి డబ్బులు గుంజుతారు.
రకరకాల పద్ధతుల్లో ఫోన్ నంబర్లు సేకరిస్తున్న నేరగాళ్లు అందమైన యువతులతో ఫోన్లు చేయిస్తారు. కొద్దిగా పరిచయం కాగానే వీడియో కాల్ మాట్లాడుకుందామని ముగ్గులోకి దించుతారు. వీడియో కెమెరా ముందే నగ్నంగా మారిపోయి.. సదరు వ్యక్తిని కూడా నగ్నంగా మారమం టూ కవ్విస్తారు. ఆ మాటలకు లొంగితే ఇక అయిపోయినట్లే. ఆ వ్యవహారం అంతా చాటుగా రికార్డు చేస్తారు. ఆ వెంటనే బేరం మొదలుపెడతారు.
ఫలానా బ్యాంకు క్రెడి ట్ కార్డు వాడుతున్నారు కాబట్టి మీకు పెద్దమొత్తంలో రివార్డు పాయింట్లు వచ్చాయ ని చెబుతారు. ఆ తర్వాత ఒక క్యూఆర్ కోడ్ పంపుతారు. దీన్ని స్కాన్ చేస్తే పాయింట్ల తాలూకు డబ్బు జమ అవుతుందంటారు. అలాగానీ చేశారో డబ్బు వచ్చే సంగతి అటుంచి ఖాతాలో ఉన్న మొత్తం ఖాళీ అవుతుంది. ఈ- కామర్స్ సంస్థలు ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీలు, స్క్రాచ్ కార్డులు పంపి బహుమతులు ఇవ్వవు.
వ్యక్తిగతంగా ఫోన్ చేయడం లేదా సందేశం ద్వారా సంప్రదింపులు జరపవు. గుర్తు తెలియని నంబర్ల నుంచి వాట్సాప్ సందేశాలు పం పించి ఏదైనా లింకు క్లిక్ చేయాలని సూచి స్తే నమ్మొద్దు. ఆఫర్ గెలుచుకోవాలంటే ముందస్తుగా డబ్బు అడిగితే మోసమని గుర్తించాలి.
అధికారిక వెబ్‌సైట్లలోనే షాపిం గ్ చేయాలి. సామాజిక మాధ్యమాల్లో వచ్చే లింకులు, ఆఫర్లని చూసి మోసపోవద్దు. ఇలాంటి నేరాలపై అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నా.. ఇంకా పలువురు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని మోసపోతున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
అకారణంగా ఏ బ్యాంకూ కార్డు బ్లాక్ చేయదు. అలా చేస్తామని చెబుతూ ఎవరైనా కార్డు వివరాలు, పిన్ నెంబర్ అడిగితే అది కచ్చితంగా నకిలీ కాల్ అనే గుర్తించా లి. ఎందుకంటే ఆ వివరాలన్నీ బ్యాంకు వద్ద ఉంటాయి. అడగాల్సిన పనిలేదు. కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్లో వెతు కుతుంటాం. వెతుకుతున్న సంస్థకు సంబంధించిన నంబర్ కనిపిస్తుంది.
ఫోన్ చేయ గానే అచ్చం సదరు సంస్థ ప్రతినిధులుగా నే మాట్లాడతారు. ఫీజు పేరుతో క్యూఆర్ కోడ్ పంపి, దాని ద్వారా చెల్లించమంటా రు. వినియోగదారుడు దాన్ని స్కాన్ చేయగానే ఖాతాలో ఉన్న డబ్బంతా ఖాళీ అవు తుంది. ప్రముఖ సంస్థలేవీ రిపేరు చేయకుండానే డబ్బు అడగవు. ఎవరిని పంపుతున్నారో, ఎప్పుడొస్తారో కూడా ముందుగానే మెసేజ్ వస్తుంది.
ఇవేవీ లేకుండా ముందుగానే డబ్బు పంపమని మెసేజ్ వస్తే అనుమానించాల్సిందే. మన మెయిల్ అడ్రస్‌లకు ఫేక్ ఐడీలతో కొంద రు మెయిల్స్ పంపుతుంటారు. లేదంటే ఏదైనా బ్యాంకో, ప్రముఖ ప్రభుత్వ సంస్థ పేరుతోనో కూడా మెయిల్స్ వస్తుంటా యి. వీటిని తెరిచిన తర్వాత ఎటాచ్మెంట్లు మాదిరిగా కనిపిస్తుంటాయి.
వీటిపై క్లిక్ చేస్తే కంప్యూటర్‌లో రిమోట్ యాక్సెస్ టూ ల్ (ర్యాట్) చొరబడే అవకాశం ఉంది. అదే జరిగితే తర్వాత ఆ సైబర్ నేరగాళ్ల బారిన పడినట్లే. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడి మోసపోతే, వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలి.
వ్యాసకర్త సెల్: 98854 86487