04-07-2025 12:32:25 AM
సోషలిజం, సెక్యులరిజం పదాలు బాబాసాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంలో లేవని, ఆ పదాలను ఎమర్జెన్సీ విధించినప్పుడు ఇందిరా గాంధీ రాజ్యాంగ పీఠికలో చేర్పించారన్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. వారం రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు దత్తాత్రేయ హోసబలే, రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిజం, సెక్యులరిజం అనే పదాలను తొలగించాలని అభిప్రాయపడ్డారు.
నిజానికి రాజ్యాంగ మూలప్రతిలో ఆ పదాలు ఉన్నాయా, లేదా అనే చర్చ ఇప్పటిది కాదు. ఆర్‌ఎస్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు.. సోషలిజం అన్న పదాన్ని రష్యాతో కాంగ్రెస్‌కు అప్పుడున్న స్నేహ సంబంధాలకు ప్రతీకగా, ఆ పదాన్ని రాజ్యాంగ పీఠికలో చేర్చారన్న వాదన ఉంది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సోషలిజం, సెక్యులరిజం పదాలు రాజ్యాంగ పీఠికలో చేరాయి.
దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ పదాల వివాదంపై గత ఏడాది నవంబర్‌లో సుప్రీం కోర్టు రూలింగ్ ఇచ్చింది. ఆ పదాలను రాజ్యాంగం నుంచి తొలగించాలని దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది. ఏదో ఒక్క మతం వైపు పక్షపాత ధోరణి కలిగి వుండకుండా ప్రభుత్వాల పనిచేసేందుకు సెక్యులర్ అనే పదం రాజ్యాంగ పీఠికలో ఉండవచ్చునని, తద్వారా నష్టమేమీ లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
ఇక భారతదేశం పరిధిలో, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అనుసరించే ఆర్థిక విధానాలకు సోషలిజం అనే పదం ప్రతిబంధకం కాబోదని కూడా సుప్రీం కోర్టు తన రూలింగ్‌లో పేర్కొన్నది. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ సంక్షేమ రాజ్యానికి నిబద్ధతను ప్రకటించేందుకు సోషలిస్టు పదాన్ని ఉపయోగించినట్టుగా చూడాలని తెలిపింది.
ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ కూడా రాజ్యాంగ పీఠికలోని ఆ పదాలను తొలగించాలని డిమాండ్ చేయటం ద్వారా తన ముసుగు తొలగించుకున్నదనే విమర్శలు వచ్చాయి. సమానత్వం, లౌకికవాదం, న్యాయం గురించి మాట్లాడే రాజ్యాంగం ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీకి నచ్చవని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. అంబేడ్కర్ విజన్‌పై ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర చేస్తున్నదని విమర్శించారు.
రాజ్యాంగం ఆత్మపైనే దాడి జరుగుతున్నదని అభివర్ణించారు. రాజ్యాంగం పీఠిక నుంచి ఆ రెండు పదాలను తొలగించాలనే డిమాండ్‌కు ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కడ్, కేంద్ర మంత్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్, జితేందర్‌సింగ్ మద్దతునిచ్చారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, బీజేపీ 2012లో ఏర్పరుచుకున్న పార్టీ రాజ్యాంగంలో..
రాజ్యాంగంపై నిజమైన విశ్వాసాన్ని కలిగివున్నట్లు, రాజ్యాంగంలో పేర్కొన్న సోషలిజం, సెక్యులరిజం సూత్రాల కు కట్టుబడి పనిచేస్తామని పేర్కొన్నది. కానీ, ఈ రెండు పదాలపై అత్యున్నత న్యాయస్థానం స్పష్టంగా ఇచ్చిన రూలింగ్‌ను ఆర్‌ఎస్‌ఎస్ తిరస్కరించినట్లయింది. విభిన్న రాజకీయ, సామాజికపరమైన పార్టీలు, సంస్థల మధ్య రాజ్యాంగ కూడికలు, తీసివేతలకు గురవుతూ ఎప్పుడూ చర్చనీయాంశాలను అందిస్తుంటుంది.