22-10-2025 12:59:17 AM
బెంగళూరు, అక్టోబర్ 21: బెంగళూరు నగరంలోని రోడ్లపై ఏర్పడిన గుంతలను వారంలోపు పూడ్చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారులను ఆదేశించారు. నగరంలోని ఐదు కార్పొరేషన్ల పరిధిలోని రోడ్లకు అక్టోబర్ 31 నాటికి మరమ్మతు పనులు పూర్తి చేయాలని చెప్పారు. బెంగళూరు రహదారుల దుస్థితి, ట్రాఫిక్ సమస్యలపై కర్ణాటక సర్కారుపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో గాంధీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో వైట్ టాపింగ్, రోడ్ల సమగ్ర అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం సీఎం సిద్ధ రామయ్య అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
బెంగళూరు రోడ్ల సమస్యలపై గ్రేటర్ బెంగళూరు అథారిటీ చీఫ్ కమిషనర్ మహేశ్వరరావు, పట్టణాభివృద్ధి శాఖ ప్రభుత్వ అదనపు కార్యదర్శి తుషార్ గిరినాథ్‌తో సహా ఇతర అధికారులతో చర్చినట్లు సీఎం తెలిపారు.
ఈ ఏడాది ఎక్కువగా వర్షాలు కురవడంతో రోడ్ల మరమ్మతు పనులు ఆలస్యమైనట్లు పేర్కొన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని, వైట్ టాపింగ్ చేయడం వల్ల రోడ్లు 25 నుంచి 30 ఏళ్ల పాటు మన్నికగా ఉంటున్నాయని తెలిపారు. అందుకే అన్ని రోడ్లకు వైట్ టాపింగ్ చేస్తున్నట్లు వివరించారు.