28-11-2025 08:50:38 PM
ఎనిమిదేళ్లుగా పరిహారం ఇవ్వడం లేదని ఆందోళన
ఎట్టకేలకు దిగివచ్చిన జీఎం
రేగొండ/భూపాలపల్లి,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఓసీ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు సింగరేణి సంస్థ నష్టపరిహారం ఇవ్వడం లేదని శుక్రవారం భూనిర్వాసితులు ధర్నా నిర్వహించారు. దీంతో సింగరేణి ఓపెన్ కాస్ట్ 2వ గని వద్ద ధర్నా చేస్తున్న విషయం తెలిసి పోలీసులు భారీగా చేరుకున్నారు. పోలీసులకు భూనిర్వాసితులకు వాగ్వాదం జరగడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు బుర్ర మనోజ్, బుర్ర రమేష్ లు మాట్లాడుతూ 2017 నుండి 50 ఎకరాలను కోల్పోయిన తమ భూములకు సింగరేణి సంస్థ నష్టపరిహారం ఇవ్వలేదని ఆందోళనకు దిగినట్లు చెప్పారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్పటి కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుగగా ఈ గ్రామాలన్నీ తరలించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం అందిస్తామని అధికారులు చెప్పారని, కానీ అపుడు చూపిన విధంగా కాకుండా ప్రభావిత గ్రామాలను మొత్తం తీసుకోకుండా ఆయా గ్రామాల్లో కొంతమేరకే తీసుకున్నారని, ఓసీ బ్లాస్టింగ్ వల్ల మేము ఇబ్బందులకు గురి అవుతున్నామని, వెంటనే గ్రామాలను పూర్తి స్థాయిలో తీసుకుని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చేంత వరకు కదిలేది లేదని హెచ్చరించారు.ఓసీ ప్రభావిత గ్రామాలైన ఆకుదారివాడ, పక్కీర్ గడ్డ, కాకతీయ కాలనీ, మదీనా కాలనీ, హనుమాన్ నగర్ ప్రాంతాలను మొత్తం సింగరేణి తీసుకొని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని చెప్పారు.
గత తొమ్మిది సంవత్సరాలుగా తమ భూములు తీసుకొని సింగరేణి సంస్థ ఇప్పటివరకు కూడా నష్టపరిహారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తుందని, ఎన్నిసార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టిన స్పందించడం లేదని వెంటనే సింగరేణి యాజమాన్యం తమ భూములను, ఇండ్లను తీసుకొని నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. నష్టపరిహారం ఇచ్చేంత వరకు ఓపెన్ కాస్ట్ ను నడవనీయమని గని ముందు ధర్నా నిర్వహించారు. పోలీసులు, సింగరేణి అధికారులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో వాగ్వాదం జరిగి సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు ముందు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. చివరికి సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డి చేరుకుని తగిన న్యాయం చేస్తామని హామి ఇవ్వడంతో భూ నిర్వాసితులు ధర్నా విరమించారు.