15-10-2025 01:13:09 AM
జైపూర్, అక్టోబర్ 14: కదులుతున్న బస్సులో అగ్ని ప్రమాదం సంభవించి, మంటలు వ్యాపించి ౨౦ మంది సజీవ దహనమయ్యారు. పలువురు అగ్ని కీలల్లో చిక్కుకుని క్షతగాత్రులయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో మంగళవారం చోటుచేసుకున్నది. జైసల్మేర్ మంగళవారం నుంచి జోధ్‌పూర్‌కు 57 మంది ప్రయాణికులతో ఓ ప్రైవేటు బస్సు బయల్దేరింది.
బస్సు మార్గంమధ్యలోని థాయ్యత్ గ్రామం గుండా వెళ్తుండగా బస్సు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో బస్సులో మంటలు ఎగసిపడ్డాయి. క్రమంగా బస్సు మొత్తం వ్యాపించాయి. మంటల్లో ౨౦ మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. కొందరు క్షతగాత్రులయ్యారు. మరికొందరు ప్రయాణికులు తమ ప్రాణాల్ని కాపాడుకునేందుకు బస్సు నుంచి బయటకు దూకారు. వారు కూడా గాయలపాలయ్యారు.
బస్సు ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
జైసల్మేర్ కలెక్టర్ ప్రతాప్‌సింగ్ తోటి సిబ్బందితో కలసి ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. బస్సు యాజమాన్యం నిర్వహణలో లోపం ఉందా? మంటలు చెలరేగానికి గల కారణాలేంటి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ప్రమాదంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు.