12-12-2025 12:00:00 AM
పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్లు
నిజామాబాద్, డిసెంబర్ 11 : (విజయ క్రాంతి) నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఉదయం 7.00 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమయ్యింది. వణికించే చలిని సైతం లెక్క చేయకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండే ఓటర్లు బారులు తీరారు. ఉదయం 9.00 గంటల సమయానికి సగటున 19.80 శాతం పోలింగ్ నమోద య్యింది.
11 గంటల సమయానికి 50.73 శాతం ఓటింగ్ పూర్తయ్యిందని అధికారులు ప్రకటించారు. కాగా, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఎడపల్లి మండలం జానకంపేట, ఎం.ఎస్.సీ ఫారంలలో, బోధన్ మండలం పెగడాపల్లిలోని పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరును, పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. హెల్ప్ డెస్క్ లు, మెడికల్ క్యాంపు, ఇతర అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా? అని తనిఖీ చేశారు.
కలెక్టర్ పర్యవేక్షణలో బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూర, వర్ని, ఎడపల్లి, నవీపేట మండలాల పరిధిలో ఓటింగ్ నిర్వహణ కోసం అధికార యంత్రాంగం పకడ్బం దీ ఏర్పాట్లు చేసింది. మొదటి విడతలో మొత్తం 184 సర్పంచ్ స్థానాలకు గాను, నామినేషన్ల ఉపసంహరణ నాటికే 29 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన 155 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అదేవిధంగా మొత్తం 1642 వార్డు స్థానాలకు గాను 07 స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 575 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
వీటిని మినహాయిస్తూ, 1060 వార్డు స్థానాలకు తొలి దశలో ఎన్నికలు జరిగాయి. 11 మండలాల పరిధిలో 1440 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, భారీగా ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. మొదటి రెండు గంటల వరకు ఒక మోస్తరుగా సాగిన ఓటింగ్, అనంతరం వేగం పుంజుకుంది. ఉదయం 11 గంటల సమయానికే 50 శాతానికి పైగా ఓటింగ్ నమోదయ్యింది.
జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డి ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించడం సత్ఫలితాలు ఇచ్చింది. ఓటింగ్ ఆవశ్యకతను వివరిస్తూ ప్రతి నివాస ప్రాం తంలో వివిధ మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, ఫొటోలతో కూడిన ఓటరు స్లిప్పులను పంపిణీ చేయడం, బీ.ఎల్.ఓలతో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసి ఓటర్లకు వారి ఓటు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంది అనే విషయాన్ని తెలియజేసేలా చర్యలు తీసుకోవడంతో ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.
పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగిందని, ప్రశాంత వాతావరణంలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అన్నారు. 71 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని, 31 కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ జరిపించామని, 40 పోలింగ్ కేంద్రాలలో మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ తీరును నిశితంగా పరిశీలన చేశారని అన్నారు. కలెక్టరేట్ నుండి కూడా ఆయా పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ తీరును, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరిగిందన్నారు.
మద్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగగా, నిర్ణీత సమయం లోపు క్యూ లైన్లలో నిలుచున్న వారికి కూడా ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఓటు వేసే అవకాశం కల్పించారు. అనంతరం మద్యాహ్నం 2.00 గంటల నుండి కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఓట్ల లెక్కింపును చేపట్టి ఫలితాలను వెల్లడించేలా విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టారు.
కౌంటింగ్ సందర్భంగా ఏ చిన్న తప్పిదానికి సైతం తావులేకుండా జాగ్రత్తగా ఓట్ల లెక్కింపు జరపాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కాగా, ఎన్నికల సాధా రణ పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ సైతం పోలింగ్ కేంద్రాలను విస్తృతంగా సందర్శిస్తూ ఓటింగ్ తీరుతెన్నులను పరిశీలన జరిపారు.
పోతంగల్, కోటగిరి, రుద్రూర్ మండలం సులేమాన్ నగర్, వర్ని మండలం సత్యనారాయణపురం, చందూర్, మోస్రా, బోధన్ మండలం అమ్దాపూర్, ఎడపల్లి తదితర చోట్ల పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరుతెన్నులను పరిశీలించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు డీసీపీ బస్వారెడ్డి పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు.
కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ సాఫీగా ఓట్ల లెక్కింపు
గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగింది. ఓటింగ్ నిర్వహించిన మీదట సంబంధిత పోలింగ్ కేంద్రాలలోనే కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడు మ ఓట్ల లెక్కింపు జరిపారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి కౌంటింగ్ ప్రక్రియను ఆద్యంతం పర్యవేక్షణ జరిపారు. అత్యధిక ఓటర్లు కలిగిన నవీపేట గ్రామ పంచాయతీకి సంబంధించి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కౌంటిం గ్ ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీల న జరిపారు.
ఎన్నికల సాధారణ పరిశీల కులు శ్యాంప్రసాద్ లాల్ సైతం కౌంటింగ్ కేంద్రాలను విస్తృతంగా సందర్శిస్తూ ఓట్ల లెక్కింపు తీరును నిశితంగా పరిశీలించారు. ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ఫలితంగా ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాఫీగా జరిగింది. అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో ఆయా టేబుళ్ల వారీగా కౌంటింగ్ సిబ్బంది ఓట్ల లెక్కింపు జరిపారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను విధిగా పాటిస్తూ, వెంటదివెంట ఓట్ల లెక్కింపు జరుపుతూ ఫలితాలు వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాలతో పాటు పరిసర ప్రాంతాలలో గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి, నిషేధాజ్ఞలు అమలు చేశారు. కౌంటింగ్ కేంద్రం లోనికి ఇతరులెవరిని అనుమతించలేదు. కౌంటింగ్ సిబ్బందితో పాటు వివిధ బాధ్యతలు నిర్వర్తించిన సిబ్బం దికి ఎంట్రీ పాసులు జారీ చేసినప్పటికీ, వారిని సైతం క్షుణ్ణంగా తనిఖీలు చేసి కౌంటింగ్ విధులకు పంపించారు. సెల్ ఫోన్ లు, వీడియోలు, కెమెరాలను నిషేధించారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా విద్యుత్ సరఫరాకు అంతరా యం లేకుండా ట్రాన్స్కో అధికారులు చర్యలు తీసుకున్నారు. పకడ్బందీ ఏర్పాట్ల నడుమ అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో పూర్తి పారదర్శకంగా, ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలకు అనుగు ణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో 79.40 శాతం పోలింగ్
కామారెడ్డి, డిసెంబర్ 11 (విజయ క్రాంతి): 2 వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా గురువారం మొదటి విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అన్నారు. గురువారం జిల్లాలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఏర్పాటు చేసిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి, కౌంటింగ్ ప్రక్రియ ను పరిశీలించిన అనంతరం పలు మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు.
2వ సాధారణ పంచాయతీ ఎన్నికలు- 2025 మొదటి విడతలో కామారెడ్డి జిల్లాలోని 10 మండలాలైన బిక్నూర్, బీబీపేట్, దోమకొండ, కామారెడ్డి , మాచారెడ్ది, పాల్వంచ, రాజంపేట, రామారెడ్డి, సదాశివ నగర్, తాడ్వాయి మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.
జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి సారించి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించడం జరిగిందనీ అన్నారు. మొత్తం ఓటర్లు 242913 పురుషులు 115535, స్రీలు. 127375, ఇతరులు. 3 ఇందులోఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు మొత్తం. 192870, పురుషులు. 88642 , స్రీలు. 104228, ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు