28-01-2026 12:00:00 AM
మేడ్చల్ జిల్లాలో మూడు మున్సిపాలిటీలలో 68 వార్డులు
68866 మంది ఓటర్లు
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
నామినేషన్ల స్వీకరణ కేంద్రాల ఏర్పాటులో జాప్యం
మేడ్చల్, జనవరి 27 (విజయ క్రాంతి): మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. మేడ్చల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు మొదటిసారి ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఎల్లంపేట్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీలలో 24 చొప్పున, అలియాబాద్ లో 20 వార్డులు ఉన్నాయి. మూడు చింతలపల్లి లో 22 831, అలియాబాదులో 20454, ఎల్లంపేటలో 25,581 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
నేటి నుంచి నామినేషన్లు
రిటర్నింగ్ అధికారులు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసి వార్డు కౌన్సిలర్ పదవులకు నామినేషన్లు స్వీకరిస్తారు. మంగళవారం షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగినప్పటికీ అధికారులు నామినేషన్ పత్రాల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడంలో జాప్యం చేశారు. ఆర్ వో లు, అసిస్టెంట్ ఆర్వోల నియామకం పూర్తి చేసి శిక్షణ ఇచ్చినప్పటికీ భవనాలు గుర్తించడంలో నిర్లక్ష్యం చేశారు. మొన్నటి వరకు గ్రామపంచాయతీలుగా కొనసాగగా ఇటీవల ప్రభుత్వం మున్సిపాలిటీలుగా అప్ గ్రేడ్ చేసింది. గ్రామపంచాయతీలు కావడం వల్ల భవనాలు చిన్నగా ఉన్నాయి. ఈ భవనాలు నామినేషన్ల స్వీకరించడానికి సరిపోవు. అధికారులు ముందస్తుగా ఎక్కడ నామినేషన్ పత్రాలు స్వీకరించాలో భవనాలు గుర్తించి సిద్ధం చేసుకోవాలి.
మంగళ వారం సాయంత్రం వరకు ఎక్కడ నామినేషన్ పత్రాలు స్వీకరిస్తారని విషయంలో క్లారిటీ లేదు. మంగళవారం రాత్రి నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఫైనల్ చేశారు. ఎల్లంపేట మున్సిపాలిటీకి సంబంధించి నామినేషన్ పత్రాలు డబ్బిలుపూరులోని భారత బైబిల్ కాలేజీలో, అలియాబాద్ కు సంబంధించి అలియాబాద్ మున్సిపల్ కార్యాలయంలో స్వీకరిస్తారు. మూడు చింతలపల్లి కి సంబంధించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. ఒకవైపు నామినేషన్ పత్రాల స్వీకరణ కేంద్రం ఏర్పాటు చేయగా, మరోవైపు విద్యార్థులకు తరగతులు నిర్వహించనున్నారు. నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు ర్యాలీలు నిర్వహిస్తారు. ర్యాలీలు, నినాదాలతో విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.