calender_icon.png 4 August, 2025 | 4:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలోచనల జ్వాల

28-07-2025 12:00:00 AM

ఫ్రెడ్రిక్ నీషే.. ఈ పేరు వింటేనే ఎవరి ఆలోచనల్లోనైనా కలకలం పుడుతుం ది. నీషే ఒక తత్త్వవేత్త మా త్రమే కాదు, తిరుగుబాటుదారుడు కూడా. ‘దేవుడు మరణించాడు.. మనమే దేవుడిని చంపేశాం’ అనే నీషే ప్రకటన ఎప్పటికీ పాతబడదు. అతని ఆలోచనలు, వ్యాఖ్యలు, ప్రకటన లు మనలో ఆలోచనా జ్వాలను రగిలిస్తాయి. అప్పటివరకూ మనలో గూడుకట్టుకున్న మన సంప్రదాయబద్ధమైన కట్టబాట్లను బద్దలు కొడతాయి.

మన అంతరంగంలో ఉత్తేజకరమైన, ఉత్సాహపూరితమైన ఆలోచనలను రేకెత్తిసాయి. జీవితాన్ని మనం ఎలా చూస్తున్నాం, నిజంగా జీవితం ఎలా ఉంది? మనకు దేనికి విలువనిస్తున్నాం. ఏది సత్యం? ఏది అసత్యం? అనే ప్రశ్నలన్నింటికీ నీషే రాతల్లో మనకు సమాధానం దొరుకుతుంది. అలాంటి మహా తత్త్వవేత్త గొప్ప రచనలు ఇప్పటి వరకు తెలుగువారికి అందుబాటులో లేకపోవడం పెద్ద లోటు.

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ అప్పుడప్పుడూ తన ఇంటర్వ్యూల్లో నీషే ఫిలాసఫీని కోట్ చేస్తుండడం వల్ల కొంతవరకు ఆయన రచనలకు ప్రాచు ర్యం వచ్చింది. కానీ, ఇతమిత్థంగా నీషేను చదువుకునేందుకు ప్రామాణిక గ్రంథాలేవీ తెలుగులో లేవు. ఈ లోటు ను భర్తీ చేస్తూ రమణ గండి, రెడ్డి అమర్‌నాథ్ అనే ఇద్దరు యువకులు నీషే ప్రసిద్ధ రచనలైన ‘ది బర్త్ ఆఫ్ ట్రాజెడీ’, ‘బియాండ్ గుడ్ అండ్ ఈవిల్’, ‘జీనాలజీ ఆఫ్ మోరల్స్’ అనే మూడు గ్రంథాలను అనువదించారు. ‘ఫెడ్రిక్ నిషే’ పేరిట పుస్తకాన్ని తీసుకొచ్చారు. 

‘ది బర్త్ ఆఫ్ ట్రాజెడీ’ అనే మొదటి చాప్టర్‌లో నీషే ప్రఖ్యాత గ్రీకు నాటకాల్లోనే లోతైన భావాలను, కళల పుట్టుక వెనుకున్న సత్యాన్ని మనకు వివరిస్తాడు. ఈ క్రమం లో నీషే అంటాడు ‘జీవితాన్ని అర్థం చేసుకునేందుకు ఒక్క కళ మాత్రమే ఉపకరిస్తుంది. అదే మనకు ధైర్యాన్ని ఇస్తుం ది’ అని అంటాడు.

అంటే కళకు నీషే ఎంత ప్రాధాన్యమిస్తా డో అర్థం చేసుకోవచ్చు. అపోలో, డయనైసస్ అనే ఇద్దరు గ్రీకు దేవుళ్ల విరుద్ధ శక్తుల మధ్య పోరాటం, వారిలో కళలను, సృజనాత్మకతను వెలికితీసిందని నీషే ఈ చాప్టర్‌లో విశ్లేషిస్తాడు. ఆ విశ్లేషణ వినూత్నంగా ఉంటుంది. చాప్టర్ చదివిన తర్వాత ఎవరైనా కళలను ఒక కొత్త కోణంలో చూస్తారంటే ఆశ్చర్యమేమీ లేదు.

‘బియాండ్ గుడ్ అండ్ ఈవిల్’ అనే రెండో చాప్టర్‌లో నీషే మనం నమ్మే మంచి, చెడు అనే అంశాలను చర్చిస్తాడు. చాప్టర్‌లో మంచికి మనమిచ్చే నిర్వచనం, చెడుకు నిర్వచనానికి సరికొత్త అర్థం చెబుతాడు. చాప్టర్ చదివిన తర్వాత మనం కూడా మంచి, చెడు నిర్వచనాలను మార్చుకునే ఆలోచనలు రేకెత్తిస్తాడు. ‘మంచీ -చెడు అనే భావనలు మన మనసులోని బలహీనతల నుంచి పుడతాయి.

ఒక మనిషి శక్తిమంతుడైతే వాటికి ప్రత్యేకమైన విలువ తీసుకొస్తాడు. ప్రత్యేకమైన తన ఆలోచనల సరళితో వాటిని జీవితంలో ఎదిగేందుకు ఉపయోగించుకుంటాడు’ అంటాడు నీషే. చాప్టర్ చదివిన తర్వాత పాఠకులు అప్పటివరకు మోస్తున్న సంప్రదాయబద్ధమైన నైతిక విలువలను ప్రశ్నించడం ప్రారంభిస్తారు. ఇది మీలో అంతర్గతంగా నిద్రాణమైన ఉన్న స్వేచ్ఛా వాంఛను తట్టిలేపుతుంది. 

‘జీనాలజీ ఆఫ్ మోరల్స్’ అనే మూడో చాప్టర్‌లో నీషే బానిస నైతికత, యాజమానుల నైతికత అనే రెండు విభిన్న పార్శాలను మన ముందు ఆవిష్కరిస్తాడు. ‘మానవ చరిత్ర మొత్తం బలహీనులు, బలవంతుల మధ్య జరిగే నిరంతర యుద్ధం’ అని నిషే అన్నాడంటే, తను జీవితాన్ని ఎంత లోతుగా అధ్యయనం చేశాడో అర్థం చేసుకోవచ్చు. మనం అనుసరిస్తున్న నైతిక విలువల వెనుక, ఉన్న అసలైన శక్తి ఏమిటి? అనే ప్రశ్నకు ఈ చాప్టర్‌లో సమాధానం దొరుకుతుంది. 

వాటిని ఆవాహన చేసుకుంటే నీషే వాక్యాలు మన జీవితానికి కొత్త దిశను చూపుతాయి. నువ్వు ఎందుకు బతకాలనుకుంటున్నావో తెలిసిన వాడివైతే, నువ్వు ఏ విధంగానైనా బతకగలుగుతావు అంటాడు నిషే. ‘మనం రాక్షసుడిని ఎదుర్కొంటున్నప్పుడు, మనం ఆ రాక్షసుడిలా మారిపోకుండా జాగ్రత్త పడాలి’ అనే అతని హెచ్చరికలు జారీ చేస్తాడు. తత్త్వవేత్తలను, జీవిత సత్యాలను అన్వేషించే వారిని మాత్రమే కాదు, కొత్త ఆలోచనలను కోరుకునే ప్రతిఒక్కరినీ ఈ పుస్తకం అబ్బురపరుస్తుంది. జీవితాన్ని కొత్త దృష్టితో చూడాలనుకుంటే కచ్చితంగా పుస్తకం చదవండి. పుస్తకం ఇప్పుడు అమెజాన్, లోగిలి.కామ్ అనే వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంది.

      ప్రతులకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 95812 38935, 95501 46514