calender_icon.png 4 August, 2025 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షుభిత రాజ్యంలో మనుషులు మాయమయ్యే కాలం

28-07-2025 12:00:00 AM

అది చిన్న పట్టణంలో బతికే ఒక మధ్య తరగతి కుటుం బం. కుటుంబంలో తల్లి, దండ్రి నలుగురు మగపిల్లలు. ఒక ఆడ పిల్ల శశి. ఈ అమ్మాయే ‘మనుషులు మాయమయ్యే కాలం’ కథ మనకు చెప్పేది. వారి తండ్రి గవర్నమెంట్ ఉద్యోగి. బదిలీల మీద బదిలీలతో ఆ కుటుంబం దేశమంతా తిరుగుతూ ఉంటుంది. భర్త కొలువు చేస్తుంటే తల్లి భారమైనా ఇల్లు నడిపిస్తుంది. ఐదుగురు పిల్లలూ పదహారేళ్ల వయసు ఇరవై ఏళ్లలోపు వారే.

పెద్ద పిల్లవాడు మెడిసిన్ చదువుతూంటే, మిగతా పిల్లలు ఇంజినీర్లో, డాక్టర్లో అయిపోదామని కష్టపడుతూంటారు. వీళ్లకు తోడు చిన్నప్పుడే, తల్లిని కోల్పోయి క్లాసులో అందరికంటే తెలివైన వాడు అనిపించుకునే స్నేహితుడు, ఇంకో కుర్రాడు ‘కే’. కాలేజీ, ట్యూషన్, లైబ్రరీ, ప్రపంచంగా బతికే పిల్లలు వీళ్లంతా. శశి మనకు కథ చెప్తుంది. కథంతా సాఫీగా జరిగుంటే ఈ పాటికి వీళ్లందరూ, వాళ్ల జీవితాల్లో స్థిరపడి ఉండేవాళ్లు.

కానీ, వాళ్లుండే ఊరు, శ్రీలంకకు ఉత్తర ప్రాంతంలోని జాఫ్నా. కథ జరిగేది 1980వ దశకంలో. శ్రీలంకలో తమిళుల వేర్పాటు ఉద్యమం, ప్రభుత్వాల అరాచకాల మధ్యలో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ జోక్యం.. ఇవన్నీ ఆ కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేసిందన్నదే కథ. 

వాస్తవిక చిత్రణ.. పాత్రధారులు

శ్రీలంకలో నెలకొన్న వాస్తవిక పరిస్థితులను రచయిత్రి గణేశానందన్ కళ్లకు కట్టినట్టుగా వివరిస్తారు. ఆమె శ్రీలంక పరిస్థితులపై ఇరవై ఏళ్లపాటు ఓపికగా అధ్యయనం చేశారు. అనేక విషయాలను పరిశోధించి నవల ద్వారా పాఠకులకు వివరించారు. రచయిత్రి అమెరికాలో పుట్టి అక్కడే పెరిగారు. అక్కడే జర్నలిజం, క్రియేటివ్ రైటింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు.

జర్నలిస్టుకు ఉండాల్సిన నిష్పాక్షికత, వాస్తవిక కోణం రచయిత్రిలో ఉన్నాయి కాబట్టే ‘మనుషులు మాయమయ్యే కాలం’ నవలలో ఆమె శిల్పంలో వాస్తవిక చిత్రణ చేయగలిగారు. 1981లో శ్రీలంక ప్రభుత్వం జాఫ్నాలోని లైబ్రరీని తగలబెట్టడం, 1983 జూలైలో కొలంబోలో తమిళులపై జరిగిన హత్యాకాండ, ఎల్‌టీటీ (ఈ) శ్రీలంక దళాలనే కాక, తోటి తమిళుల్ని కూడా ఊచకోత కొయ్యడం, ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్, జాఫ్నా హాస్పిటల్‌లో రోగులపై జరిపిన కాల్పులు.. ఇలా ఎన్నో వాస్తవిక ఘటనల సమాహారంగా రచయిత్రి నవలను ఆవిష్కరించారు. 

బలమైన స్త్రీ పాత్రలు..

శ్రీలంక సైన్యం తమిళ కుటుంబాల్లోని మగ పిల్లలందర్నీ అపహరించి, నిర్బంధించినప్పుడు బాధిత కుటుంబాలు మదర్స్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తాయి. ఆ పోరాటంలో శశి వాళ్లమ్మ భాగస్వామి అవుతుంది. అలానే బ్లాక్ జూలై దాడుల్లో  శశి, వాళ్లన్న చిక్కుకుంటారు. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన మనుషులు చుట్టూ జరిగే హింసాకాండ వల్ల, ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాల వల్ల ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడ్డాయో ఈ నవల మనకు వివరిస్తుంది.

కథలో బలమైన పాత్రధారులందరూ ఆడవాళ్లే. వేలాది కుటుంబాలు నాడు ఎలాంటి  ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. వాటి నుంచి బయటకు వచ్చేందుకు మహిళలు ఎలాంటి కృషి చేస్తారన్నది రచయిత్రి తన పాత్రల ద్వారా వివరించారు. దీనిలోని ఎన్నో స్త్రీ పాత్రలు భయానకమైన పరిస్థితుల్లోనూ, మనం పోరాడి గెలవచ్చు అనే ఆశావక దృక్పథాన్ని కలుగ జేస్తాయి. నవలలో అన్ని పాత్రలకూ పేర్లుంటాయి.

కానీ, శశి అమ్మానాన్నకు ఉండవు. అదొక ఔచిత్యం. శశి తండ్రి ల్యాండ్ సర్వేయర్‌గా పని చేస్తూంటాడు. శశి స్నేహితుడి పేరు ‘కే’. ఫ్రాంజ్ కాఫ్కా రాసిన సుప్రసిద్ధ నవల ‘కాసిల్’లో ల్యాండ్ సర్వేయర్‌గా పనిచేసే ప్రధాన పాత్రధారి పేరు ‘కే’. ఆ కథలో ఒక కోటలో అడుగుపెట్టి చిక్కుకుపోతాడు. తన ఉనికిని కోల్పోతాడు.

సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వాలైనా, ఉద్యమ నాయకులైనా హింసను ఎంచుకున్నప్పుడు మధ్యలో సామాన్య ప్రజల జీవితాలు ఎలా చిక్కుకుపోయి చెల్లాచెదురు అవుతాయో చెప్తుందీ నవల. తెలుగు అనువాదకురాలు ఉమా నూతక్కి ఎంతో చక్కగా, సులభమైన శైలిలో తెలుగులోకి అనువదించారు. ప్రతుల కోసం ఛాయ పబ్లిషర్స్ వారి https://chaayabooks.com/అనే వెబ్‌సైన్‌ను సందర్శించి ఆర్డర్ చేసుకోవచ్చు.