24-07-2025 01:37:42 AM
హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి) : రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు చేయాల్సిందేనని బీజేపీ డిమాండ్ చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై తాము వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లుగా కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. బీజేపీపై తప్పుడు ప్రచారం చేయడమే ధ్యేయంగా కాంగ్రెస్ నాయకుల వ్యవహారం కనిపిస్తోందన్నారు.
బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడారు. రాష్ర్టంలో బీజేపీకి మంచి వాతావరణం ఉందని.. కాబట్టి నాయకులు, కార్యకర్తలు మధ్య ఎలాంటి మనస్పర్థలు లేకుండా కలిసిమెలిసి పనిచేసి పార్టీని గెలిపించేందుకు కష్టపడాలన్నారు.
పంచాయతీరాజ్ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు వార్డు మెంబర్ స్థాయి నుంచి జడ్పీటీసీ స్థాయి వరకు సిద్ధంగా ఉండి గెలుపును సాధించేందుకు కృషిచేయాలన్నారు. తల్లి లాంటి పార్టీకి ఎవరూ ద్రోహం చేయవద్దన్నారు. గతంలో తాను ఎమ్మెల్సీగా రాష్ర్టవ్యాప్తంగా సేవలందించానని.. ఆ సమయంలో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ప్రజలు తనపై విశేష ఆదరణ చూపారని గుర్తుచేసుకున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో త్వరలో పర్యటించనున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులంతా ఐక్యతను ప్రదర్శించి ప్రజల్లో మరింత విశ్వాసం పెంచాలని.. కొత్త, పాత అనే భేదం లేకుండా నాయకులు, కార్యకర్తలు అందరూ కలసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కృషి చేయాలన్నారు. రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందన్నారు.
యూపీఏ హయాంలో యూరియా కోసం రైతులు అనేక కష్టాలు పడ్డారని.. క్యూలైన్లలో గొడవలు, లాఠీచార్జీలు జరిగిన అనేక ఘటనలు చూశామన్నారు. మోదీ ప్రధాని అయ్యాక ఆ పరిస్థితులు లేవన్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్ల ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలించి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో అవసరానికి మించి 2.5 లక్షల టన్నుల అదనపు యూరియా సరఫరా చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ తెలంగాణ రాష్ర్టంలో కొన్ని ఫెర్టిలైజర్ షాపుల ముందు రైతులు బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయని.. దీనికి కారణం రాష్ర్ట ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు.