calender_icon.png 26 July, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసింగ్ విత్ ఏ హ్యూమన్ టచ్

25-07-2025 02:45:34 AM

  1. నిజాయితీ, మానవత్వం కలగలిసిన పోలీస్ వ్యవస్థే నా లక్ష్యం 
  2. హక్కులను కాపాడే గొప్ప వ్యవస్థగా భారతీయ పోలీసు మారాలి 
  3. ప్రతి పోలీస్ స్టేషన్‌ను టెక్నాలజీతో ముందుకు తీసుకెళ్లాలి
  4. డిజిటల్ కాలంలో సైబర్ నేరాలు పెద్ద సవాల్
  5. హైదరబాద్‌లో ట్రాఫిక్ వయొలేషన్స్ ఎక్కువ
  6. సిబ్బంది మానసిక ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి
  7. ఒత్తిడిని తట్టుకోవడమే పోలీసులకు పెద్ద సవాల్

విజయక్రాంతి’ స్పెషల్ ఇంటర్వ్యూలో డీసీపీ (ట్రాఫిక్) రాహుల్ హెగ్డే 

* తెలంగాణ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో కీలక ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఐపీఎస్ రాహుల్ హెగ్డే.. తన ఉద్యోగ ప్రయాణం, సమాజం కోసం పడే తపన, ప్రజలకి పోలీసు వ్యవస్థను ఎలా దగ్గర చేయాలో, ఇంకా ఎదుర్కొంటున్న సవాళ్లు, సాధించిన విజయాల గురించి ‘విజయక్రాంతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ప్రజలతో పోలీసుల సంబంధాలు, ఈ డిజిటల్ కాలంలో జరిగే నేరాలను ఎలా అరికట్టాలి, యువతకు సరైన దారి ఎలా చూపించాలి వంటి చాలా విషయాలపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.  రాహుల్ హెగ్డే  హైదరాబాద్ నగర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ట్రాఫిక్‌గా పనిచేస్తున్నారు. 2014లో  యుపిఎస్సి పరీక్షలో ఉత్తీర్ణులై, తెలంగాణ పోలీసు విభాగంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా, ఆ తర్వాత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు గా రాజన్న సిరిసిల్లా, సూర్యాపేట జిల్లాలలో పనిచేశారు.

హైదరాబాద్, సిటీ బ్యూరో జూలై 24,(విజయక్రాంతి): తాను పనిచేసే చోట ‘పోలీసింగ్ విత్ ఏ హ్యూమన్ టచ్’ ఉండాలని కోరుకుంటున్నానని, కేవలం దండించే వ్యవస్థలా కాకుండా, సహాయం చేసే స్నేహపూర్వక వ్యవస్థగా మారాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు హైదరాబాద్ నగర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ట్రాఫిక్ రాహుల్ హెగ్డే చెప్పారు. నిజాయితీ, మానవత్వం కలగలిసిన వ్యవస్థగా పోలీసును తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. 

చిన్నప్పటి నుంచే సేవ చేయాలనే కోరిక

“చిన్నప్పట్నుంచీ నాలో ఒక కోరిక ఉండేది. సమాజానికి ఏదో చేయాలి, జనాలకి సేవ చేయాలి అని. పోలీసులు అంటే కేవలం దొంగల్ని పట్టుకోవడం కాదు, శాంతిభద్రతల్ని కాపాడి, మామూలు మనిషికి అండగా నిలబడతారు కదా. అన్యాయం జరిగినప్పుడు న్యాయం అందించే అవకాశం ఈ ఉద్యోగంలో ఉంది. అదే నన్ను బాగా ఆకర్షించింది” అని రాహుల్ హెగ్డే చెప్పారు.

తాను పనిచేసే చోట ‘పోలీసింగ్ విత్ ఏ హ్యూమన్ టచ్’  ఉండాలని కోరుకుంటున్నానని, కేవలం దండించే వ్యవస్థలా కాకుండా, సహాయం చేసే స్నేహపూర్వక వ్యవస్థగా మారాలని తన ఆకాంక్షను వెల్లడించారు. ప్రతి పోలీస్ స్టేషన్‌ను టెక్నాలజీతో ముందుకు తీసుకెళ్లాలని, సిబ్బంది మానసిక ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఆ ఘటన చాలా సంతృప్తినిచ్చింది

తాను పనిచేసిన కాలంలో చిన్న పిల్లల్ని అక్రమంగా తరలిస్తున్న ఒక పెద్ద గ్యాంగ్‌ని పట్టుకుని, ఆ పిల్లల్ని వాళ్ల తల్లిదండ్రుల దగ్గరికి చేర్చిన సంఘటన తనకు చాలా సంతృప్తినిచ్చిందని హెగ్డే గుర్తు చేసుకున్నారు. అలాగే సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగా గ్రామంలో, తండ్రిని కోల్పోయిన ఓ అనాథ బాలుడికి ఇల్లు కట్టించి ఇవ్వడం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజల్లో పోలీసుల పట్ల ఉన్న అపోహల్ని పోగొట్టడం, తక్కువ వనరులతో పనిచేయడం, నిరంతరం ఉండే ఒత్తిడిని తట్టుకోవడం వంటివి పెద్ద సవాళ్లుగా ఆయన వివరించారు.

అడవిలో 45 రాత్రులు

ఐపీఎస్‌గా తనకు మొ దటి పోస్టింగ్ ఏటూరునాగరంలో ఏఎస్పీగా వచ్చిందని, అది నక్సల్స్ ఎక్కువగా ఉండే ప్రాంతమని ఆయన చెప్పారు. అక్కడ ఆరు నుంచి ఏడుగురు నక్సల్స్ లొంగిపోవడం, ఒక ఎన్‌కౌంటర్‌లో పది మంది మావోయిస్టులు చనిపోవడం తన కెరీర్‌లో సాధించిన పెద్ద విజయాలుగా ఆయన భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో అడవిలో 4-5 రాత్రులు ఉండటం లాంటి కఠినమైన శిక్షణ చాలా కష్టమైనా, అది తనకు గొప్ప అనుభవాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.

 సక్సెస్‌ఫుల్‌గా ఎన్నికల నిర్వహణ

ఏటూరునాగరం తర్వాత తన తదుపరి పోస్టింగ్ సిరిసిల్లా ఎస్పీగా వచ్చిందని రాహుల్ హెగ్డే  తెలిపారు. తాను సిరిసిల్లాకు వచ్చాక, కొన్ని నెలలకే ఎలక్షన్ల హడావిడి మొదలైందని, ఎలాంటి చిన్న తప్పులు లేకుండా ఎన్నికలను సక్సెస్ ఫుల్ గా నిర్వహించగలిగామని చెప్పారు.

నాడు మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడం వల్ల ప్రతి చిన్న విషయం కూడా రాష్ర్ట స్థాయిలో ప్రాముఖ్యతను సంతరించుకుంటుందని, అయినప్పటికీ తాము ఇక్కడ శాంతిభద్రతలను చాలా సమర్థవంతంగా నిర్వహించామని ప్రశంసించారు. ఇక్కడ ఇసుక అక్రమ రవాణాను కంట్రోల్ చేయగలిగామని, ప్రమాదాలను కూడా తగ్గించగలిగామని ఆయన తెలిపారు.

రాంగ్ రూట్‌లో వెళ్లడం ప్రమాదకరం

హైదరాబాద్ ట్రాఫిక్ విషయానికి వస్తే, హెల్మెట్ పెట్టుకోకపోవడం లాంటి ఉల్లంఘనలు వయొలేషన్స్ ఎక్కువగా ఉంటాయని, వీటిని గుర్తించడం సులభమని రాహుల్ హెగ్డే  చెప్పారు. లైసెన్స్, ఇన్సూరెన్స్ వంటి వాటిని డాక్యుమెంట్ల తనిఖీ ద్వారానే గుర్తించగలమని తెలిపారు.

రాంగ్ రూట్‌లో వెళ్లడం కూడా ప్రమాదకరమని, షార్ట్‌కట్‌ల కోసం ఇలాంటి తప్పులు చేయడం వల్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి చాలా మంది ఇబ్బందులు పడతారని ఆయన వివరించారు. సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడింగ్ వంటివి కూడా సమస్యలు సృష్టిస్తాయని, ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటిస్తే ఈ ఇబ్బందులను చాలా వరకు తగ్గించవచ్చని సూచించారు.

సివిల్  కోసం కోచింగ్ తీసుకోలేదు

సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కోసం తాను ప్రత్యేకంగా కోచింగ్ తీసుకోలేదని రాహుల్ హెగ్డే వెల్లడించారు. బెంగళూరులోని లైబ్రరీలో తన క్లాస్‌మేట్స్‌తో కలిసి గ్రూప్ స్టడీ చేసేవారమని, 11వ తరగతి నుంచి ఇంజినీరింగ్ వరకు ఈ గ్రూప్ స్టడీ కొనసాగిందని తెలిపారు.

2014లో యూపీఎస్సీ పరీక్షలో తన మొదటి సీరియస్ అటెంప్ట్‌లోనే ఐపీఎస్‌కు ఎంపికయ్యానని, ఐపీఎస్ తన మొదటి ఛాయిస్ అని పేర్కొన్నారు. మొదట్లో పరీక్షను తక్కువ అంచనా వేశామని, అది ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఒప్పుకున్నారు. అయితే, ఆ తర్వాత సరైన వ్యూహం, కఠోర శ్రమతో విజయం సాధించానని చెప్పారు.

కుటుంబ నేపథ్యం

 రాహుల్ హెగ్డే  కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో ని ఓ మామూలు మధ్యతరగతి కుటుంబం నుం చి వచ్చారు. ఆయన తం డ్రి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. అమ్మ ఇంటి పనులు చూసుకునేవారు. ఆయన భార్య పేరు విజేత. తను ఇంటీరియర్ డిజైనర్. ఈ దంపతులకు ‘లక్ష్’ అనే ఓ ముద్దుల బాబు ఉన్నాడు. బెంగళూరులోని అర్.వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో విద్యాభ్యాసం చేశారు.

కుటుంబమే నా బలం

ఉద్యోగ జీవితంలో టైం మెయింటెయిన్ చేయడం కష్టమని, కుటుంబానికి తక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని హెగ్డే  అన్నారు. తన కుటుంబం పూర్తి మద్దతు ఇస్తుందని, అదే తనకు బలం అని తెలిపారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి తనకు ఇష్టమైన హాబీలు, వ్యాయామం చేస్తానని చెప్పారు. సివిల్స్ ప్రిపరేషన్ సమయంలో తన సోషల్ లైఫ్ దాదాపుగా నిల్ అని, కేవలం స్టడీ సర్కిల్‌కి మాత్రమే పరిమితం అయిందని గుర్తు చేసుకున్నారు. గతంలో క్రికెట్ బాగా ఆడేవాడినని, ఇప్పుడు వర్కవుట్‌కే ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.

హక్కులను కాపాడే గొప్ప వ్యవస్థగా  పోలీసు

ప్రతి పౌరుడికి న్యాయం అందించే, వారి హక్కులను కాపాడే గొప్ప వ్యవస్థగా భారతీయ పోలీసు మారాలని ఆశిస్తున్నట్లు రాహుల్ హెగ్డే గారు తన ఇంటర్వ్యూను ముగించారు. నిజాయితీ, మానవత్వం కలగలిసిన వ్యవస్థగా పోలీసును తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన  చెప్పారు.

సైబర్ నేరాలు పెద్ద సవాల్

డిజిటల్ కాలంలో సైబర్ నేరాలు పెద్ద సవాల్ అని రాహుల్ హెగ్డే  అన్నారు. ‘డిజిటల్ అరెస్ట్’, ‘హనీ ట్రాప్’, కొరియర్ ఫ్రాడ్స్ వంటి కొత్త మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. బయట ఎవరినైనా నమ్మే ముందు పది ప్రశ్నలు అడిగినట్లే, ఆన్‌లైన్‌లో ఎవరో ఫోన్ చేసి బెదిరించినా, వివరాలు అడిగినా వెంటనే స్పందించకుండా దగ్గరలోని పోలీసుల్ని సంప్రదించాలని సూచించారు.

వ్యక్తిగత సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పంచుకోవడం వల్ల దొంగతనాలకు గురయ్యే అవకాశం ఉందని, ప్రైవసీని పాటించాలని, సోషల్ మీడియాలో అనవసరమైన వివరాలను పోస్ట్ చేయవద్దని యువతకు గట్టిగా చెప్పారు. ఫాలోవర్లు, లైక్‌ల కోసం అనవసరంగా సమాచారాన్ని పంచుకోవడం వల్ల కెరీర్, జీవితం దెబ్బతింటాయని ఆయన స్పష్టం చేశారు.