31-08-2025 12:28:53 AM
తాడ్వాయి, ఆగస్టు 30(విజయక్రాంతి): రైతులు సాగుచేసిన పత్తి పంటను అటవీ శాఖ అధికారులు నాశనం చేశారు. ఈ ఘట న ములుగు జిల్లా తాడ్వాయి మండలం బయక్కపేట గ్రామం సమీపంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతులు పత్తి పంట వేయగా మొక్కలు మీటరు ఎత్తున పెరిగాయి. పోడు భూముల్లో పత్తి పంట సాగు చేశారంటూ ఫారెస్ట్ సెక్షన్ అధికారి, మరికొందరు సిబ్బంది వచ్చి పత్తి మొక్కలను పీకిపడేసారని రైతులు ఆరోపించారు.
ఇద్దరు రైతులకు చెందిన పత్తిపంటలో మొక్కలను పీకి పడేసి ఉన్నాయన్నారు. దీనిపై తాము అటవీ శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగామని, పత్తి మొక్కలు ఎందుకు నాశ నం చేశారని నిలదీశామన్నారు. అవి పోడు భూములు కాదని, తాము కాయకష్టం చేసుకుని పంటవేసుకున్నామన్నారు. ఒకొక్క మొక్కకు వేలరూపాయలు పెట్టబడి పెట్టామని, రెండు నుంచి మూడెకరాల వరకు సాగుచేసుకున్నామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు నష్ట పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు.మళ్లెప్పుడైన మా పంటజోలికి వస్త్తే పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.రైతులు,గ్రామస్తులు తిరగబడటంతో ఫారెస్టు అధికారులు, అక్కడి నుంచి వెళ్లిపోయారు.