calender_icon.png 30 January, 2026 | 10:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ అధికారి సంతకం ఫోర్జరీ

30-01-2026 12:49:28 AM

ఇంటి లోన్ కోసం నకిలీ పత్రాల సృష్టి

షాద్ నగర్, జనవరి 29 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని హాజీపల్లి గ్రామంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఏకంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే కాకుండా, బ్యాంకు లోన్ కూడా పొందిన ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లో కి వెళ్లితే  షాద్నగర్ పట్టణానికి చెందిన మండ్ల సుధాకర్ అనే వ్యక్తి, హాజీపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రాసాల కురుమయ్యకు చెందిన ఇంటిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

అడ్వాన్స్గా  రూ.5 లక్షలు కూడా చెల్లించాడు. అయితే, ఆ ఇంటికి సరైన అనుమతులు లేకపోవడంతో బ్యాంకు లోన్ మంజూరు కాలేదు. దీంతో సుధాకర్ ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు.తరువాత, ఇంటి యజమాని కురుమయ్య ఆ ఇంటిని మరొకరికి అమ్మే క్రమంలో అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. అప్పటి హాజీపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి బిరం హనుమంత్ రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి, కార్యాలయ ముద్రలను (స్టాంప్స్) అక్రమంగా వినియోగించారు.

పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ’ఇంద్రజ’ అనే కారోబార్ పేరుతో ఫోర్జరీ చేసినట్లు సమాచారం. ఫోర్జరీ పత్రాలను సరిచూడకుండానే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశాడు ఈ నకిలీ పత్రాల ఆధారంగానే ఒక ప్రైవేట్ బ్యాంకు సదరు ఇంటికి లోన్ మంజూరు చేసింది. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని తెలుసుకున్న మాజీ కార్యదర్శి హనుమంత్ రెడ్డి, బాధితుడు సుధాకర్తో కలిసి షాద్నగర్ పోలీసులను ఆశ్రయించారు. ఆస్తి ధృవీకరణ పత్రం (Assessment) పై ఉన్న సంతకాలు తనవి కావని, పంచాయతీ ముద్రలను కూడా తనకు తెలియకుండానే వాడారని హనుమంత్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

నా సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన రాసాల కురుమయ్య మరియు ఇందులో ప్రమేయం ఉన్న వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఘటనపై షాద్నగర్ ఎస్‌ఐ శ్రీకాంత్ స్పందిస్తూ.. ఫోర్జరీకి సంబంధించి తమకు లిఖితపూర్వక ఫిర్యాదు అందిందని తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని, దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.