30-01-2026 02:16:58 AM
హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ విషయంలో యాక్టింగ్ తప్ప యాక్షన్ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. రెండేళ్ల నుంచి నోటీసులు ఇవ్వడమే తప్పా ఎలాంటి చర్యలు లేవన్నారు. బీఆర్‌ఎస్ ధరణి పేరుతో కుంభకోణం చేస్తే.. కాంగ్రెస్ భూ భారతి పేరుతో అవినీతికి పాల్పుడుతోందని ఆరోపించారు. గురువారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి, అక్రమాలు, కుంభకోణా లు, ఫోన్ ట్యాపింగ్ ఇతర అంశాలపై సిట్ పనికిరాదని, వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డిని కేసీఆర్ కాపాడారని, ఇప్పుడు గురువు కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి కాపడుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ నేతలకు నోటీసుల ఇవ్వడ మేనని, అరెస్టులు మాత్రం చేయడం లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఒకరి నొకరు దూషించుకుం టూ డ్రామాలు ఆడుతున్నాయని ఆయన మండిపడ్డారు. కాంగ్రె స్ ప్రభుత్వంలో దోపిడీ జరుగుతోందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తుంటే.. మీ హయాంలోని పథకాలనే అమ లు చేస్తున్నామని కాంగ్రెస్ చెపుతోందన్నా రు.
గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన లిక్కర్ పాలసీనే అమలు చేస్తున్నామని చెపుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల పథకంలో కుంభకోణం జరగిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే పరిస్థితి ఉన్నదని ఆరోపించారు. బీఆర్‌ఎస్ రూ.10 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. కాంగ్రెస్ ఈ రెండేళ్లలో రూ.2 లక్షల కోట్లు అప్పులు చేసిందని విమర్శించారు.
అవినీతిపై విచారణ జరగాలి
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో కొన్ని బ్యారేజీల వరకే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు అప్పగించిందని, మొత్తం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు, అవినీతిపై సమగ్ర విచారణ జరగాల్సిందేనని అన్నారు. హెచ్‌ఎండీఏ స్కామ్, గొర్రెల స్కామ్, జీఎస్టీ స్కామ్, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అవినీతి, ధరణి భూ దందా, ఫార్ములా ఈ రేస్ వంటి అక్రమాలపైన విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు.
కాగా ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. బీజేపీకి వస్తున్న ఆదరణను అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏ పార్టీలో ఉంటే ఏమిటని? కాంగ్రెస్, బీఆర్‌స్ పార్టీ ఒక్కటే కదా? అని మీడియా అడిగిన ప్రశ్నకు రాంచందర్‌రావు సమాధానమిచ్చారు.