05-09-2025 06:44:46 PM
మందమర్రి,(విజయక్రాంతి): సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాలకు ఏరియాలోని సెక్యూరిటీ సిబ్బంది కలిసి రావాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎస్ నాగరాజు గోపాల్ బ్రాంచ్ కార్యదర్శి అల్లి రాజేందర్ లు కోరారు. శుక్రవారం ఏరియాలోని ఎస్ అండ్ పిసి కార్యాలయంలో సెక్యూరిటీ సిబ్బందిని కలిసి వారితో మాట్లాడారు.
సెక్యూరిటీ సిబ్బందికి సమయం దాటినప్పటికి యూనిఫామ్ క్లాత్, బూట్లు ఇవ్వలేదని, గనులపై గస్తి నిర్వహిస్తున్న సమయంలో చెట్ల పొదల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని వాటిని తొలగించాలని, రాత్రి షిఫ్టు విధులు నిర్వహించే గార్డులకు టార్చ్ లైట్ ఇవ్వాలని, చెక్ పోస్టులలో కొత్త ఫర్నిచర్ ఏర్పాటు చేయాలని, బెల్లంపల్లి రామకృష్ణాపూర్ వారికి గతంలో మాదిరి పరేడ్ అక్కడే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. చెక్ పోస్టులన్నింటిలో వర్షానికి ఇబ్బంది లేకుండా మరమ్మత్తులు చేయాలని, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి పరేడ్ అలవెన్స్ లేనందున వారి యొక్క పర్చేస్ ఆర్డర్లలో పరేడ్ అలవెన్స్ ఇచ్చేలా మార్పులు చేయాలన్నారు.
సెక్యూరిటీ సిబ్బంది యూనిఫామ్ ధరించకుంటే ఇబ్బంది పెట్టే యాజమాన్యం సమయానికి ఇవ్వాల్సిన యూనిఫామ్, బూట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం సరైనది కాదని, సెక్యూరిటీ సిబ్బంది తగ్గుతున్నందున కొత్తగా వస్తున్న యువతి యువకులతో రిక్రూట్మెంట్ చేసి సంస్థ ఆస్తులను కాపాడాలని, క్యాడర్ స్కీము ను కొలిండియాలో మాదిరి మార్చాలని, రిటైర్మెంట్ సమయంలో వస్తున్న జమేదార్, ఇన్స్పెక్టర్ ప్రమోషన్ల వలన వేరే ఏరియాకు వెళ్లడం ఇబ్బంది కలుగుతున్నందున ఎక్కడివారికి అక్కడే ప్రమోషన్లు ఇవ్వాలన్నారు.
గుర్తింపు సంఘం గత సంవత్సరం సంస్థకు వచ్చిన లాభాల వాటా ప్రకటన కోసం యాజమాన్యంపై పోరాటాలు చేసి లాభాలు ప్రకటింప చేసి యాజమాన్యం చేత 35% వాటా చెల్లించేలా అన్ని సంఘాలను కలుపుకొని పోరాటం చేయాలన్నారు. ఈనెల 11,12 న చేపట్టనున్న సొంతింటి కళ కావాలా... సింగరేణి క్వాటర్ కావాలా... అనే అంశంపై సిఐటియు ఆధ్వర్యంలో జరగనున్న పోలింగ్ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సీనియర్ ఇన్స్ పెక్టర్ కు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ బాసబోయిన కుమారస్వామి సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.