మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
దేవరకొండ: కాంగ్రెస్ ప్రభుత్వం మరియు అధికారుల నిర్లక్ష్యంతో మిషన్ భగీరథ తాగునీరు గ్రామాలకు సరిగా అందడం లేదని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కోదండపురం గ్రామంలో మిషన్ భగీరథ నీటి సరఫరా సంపులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మొత్తం ఆరు సంపులు ఉండగా ప్రస్తుతం కేవలం రెండు సంపుల ద్వారా మాత్రమే నీరు సరఫరా జరుగుతోందని తెలిపారు.
మిషన్ భగీరథ నీరు సరిగా రాక గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు నిమ్మకు మీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా స్పందించి మిగిలిన సంపులను తక్షణమే మరమ్మతులు చేసి పూర్తి స్థాయిలో నీటి సరఫరా చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






