23-01-2026 12:00:00 AM
మెదక్‌లో బీఆర్‌ఎస్ భారీ బైక్ ర్యాలీ
మెదక్, జనవరి 22(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రజాపాలనకు వ్యతిరేకంగా మెదక్ జిల్లా కేంద్రంలో గురువారం బీఆర్‌ఎస్ పార్టీ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీ స్థానిక పార్టీ జిల్లా కార్యాలయం నుండి కార్యకర్తలు, నాయకులు భారీగా చేరుకొని బాలాజీ ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది. అనంతరం డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కొండన్ సావిత్రి సురేందర్గౌడ్ తో పాటు మాజీ కౌన్సిలర్ గోదల జ్యోతి కృష్ణ, పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి హరీష్రావు పార్టీ కండువాకప్పి ఆహ్వానించారు.
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను బీఆర్‌ఎస్ కైవసం చేసుకోవడం ఖాయమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని, ప్రజాపాలన పేరుతో దగా చేసిందని హరీష్రావు విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా చాటుతేనే మెదక్ జిల్లా రద్దు కాకుండా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు ఫారుఖ్ హుస్సేన్, శేరి సుభాష్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్లు మల్లిఖార్జున్గౌడ్, కొండన్ సావిత్రి, తిరుపతిరెడ్డి, బట్టి జగపతి, ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, కొండన్ సురేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.