30-12-2024 12:00:00 AM
అవసరాల్లో
సాధారణ ప్రజకు
సాక్షాత్ భగవంతుని ప్రతిరూపాలు
కోటీశ్వరులనూ ఆదుకునే
ఆపన్నహస్తాలు
బ్యాంకర్లు
లక్ష్మీదేవితో నిరంతరం క్రీడించే
విష్ణు స్వరూపులు
అవును...
డబ్బు పామే!
సర్పశయ్యలపై
పవళించే కేశవులు వారే
‘కట్టల’ పాములను
మెడలో ధరించే శివులు
నలువైపులా చుట్టుముట్టే
శతకోటి దరిద్రాలకు
అనంతకోటి ఉపాయాలు సృష్టించే
చతుర్ముఖులు
ప్రజలకు
వైట్ కాలర్ ఉద్యోగులే
బ్యాంకు నాణేనికి మరోవైపు
శ్వేతగళ బంధనంలో
బంధిత హృదయాలు
గాయాల పాలైన మెదళ్లు
చాంతాడు లైనులో
నిలబడ్డ కస్టమరు
అసహనాన్నంతా
కౌంటర్లో కుమ్మరించి
రక్త పీడన హెచ్చుతగ్గులకు
కారణంగా నిలుస్తాడు
పైత్యం ప్రకోపించిన మరొకడు
సహనానికి
ఒకే రోజులో వందో పరీక్ష పెడతాడు
అన్ని ప్రశ్నలకూ
జవాబు పత్రంలో
కనబడేది చిరునవ్వే!
అర్హత లేని ఓ కస్టమరు
అప్పుకోసం సతాయిస్తాడు
టార్గెట్ల శిఖరం
నిబంధనల స్పీడ్ బ్రేకర్లుండే
గతుకుల రోడ్డులో
వేగం అంకెలను పెంచమంటుంది
నిముషాల ముల్లుతో పోటీలో
క్యూ లైన్ గమనాన్ని
విజేతగా నిలపాలన్న తొందరలో
తేడా వచ్చిన రూపాయి
మరుసటి రోజుదాకా
మనసును మాయం చేస్తుంది
ఎవరితో మాట్లాడుతున్నా
అదే గుర్తొచ్చి
రేపటి సంజాయిషీ లేఖకు
జవాబు సిద్ధమవుతుంటుంది
లాగిన్లూ లాగౌట్ల నడుమ కాలం
ఎవరూ రాయని చరిత్రలో
చిన్నపాటి పానిపట్టు
యుద్ధ సమయాలే!