29-12-2024 12:00:00 AM
భారతదేశం ప్రపంచంలోని అత్యంత అసమాన దేశాలలో ఒకటి. మొత్తం 80 శాతం జాతీయ సంపద 10 శాతం జనాభా వద్ద ఉంది. భారతీయ జనాభాలో అత్యంత సంపన్నులైన 1 శాతంమంది దేశ సంపదలో 41.5 శాతం కలిగి ఉన్నారు.
అధిక స్థాయిలో అసమానతలు ఉన్నందున భారతదేశం సంపన్నులపై పన్ను విధించేందుకు మరింత కృషి చేయాలని ప్రఖ్యాత ఫ్రెంచ్ ఆర్థికవేత్త రచయిత థామస్ పికెట్టీ పిలుపునిచ్చారు. ఢిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ ‘రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ (ఆర్‌ఐఎస్), ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నిర్వహించిన కార్యక్రమంలో భారతదేశం ధనవంతులపై పన్ను విధించడంలో చురుకుగా ఉండాలని,
ప్రపంచం లోని అతిపెద్ద సంపదపై సమర్థవంతంగా పన్ను విధించడంలో సహకరించడానికి 20 ప్రధాన ఆర్థిక వ్యవస్థల సమూహానికి చెందినఆర్థిక మంత్రులు జూలైలో చేసిన ప్రతిజ్ఞను అనుసరించాలని ప్రపంచ అసమానత ల్యాబ్ పేపర్ ప్రచురించిన 2024 నివేదికను ఉటంకిస్తూ పికెట్టీ చెప్పారు. భారతదేశ జనాభాలో ధనవంతులైన 1శాతం మంది జాతీయ ఆదాయంలో 22.6 శాతాన్ని నియంత్రిస్తున్నారని ఫ్రెంచ్ ఆర్థికవేత్త చెప్పారు. దేశంలో ఆర్థిక అసమానతలకు ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే పరిష్కార మార్గం అని కూడా చెప్పారు.
అత్యంత అసమాన దేశాలలో...
భారతదేశం ప్రపంచంలోని అత్యంత అసమాన దేశాలలో ఒకటి. మొత్తం 80 శాతం జాతీయ సంపద 10 శాతం జనాభా వద్ద ఉంది. భారతీయ జనాభాలో అత్యంత సంపన్నులైన 1 శాతంమంది దేశ సంపదలో 41.5 శాతం కలిగి ఉన్నారు. సగం మంది పేదలు జాతీయ సంపదలో కేవలం 4.1 శాతం కోసం తహతహలాడుతున్నారు. దేశంలోని మొత్తం వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ)లో సుమారు 64శాతం జనాభా దిగువన ఉన్న 50 శాతం నుండి రాగా, 4శాతం మాత్రమే టాప్ 10శాతం నుండి వచ్చింది.
ప్రభుత్వం కార్పొరేట్ పన్ను స్లాబ్‌ను 30 శాతం నుండి 22శాతానికి తగ్గించి సంపన్నులకు మేలు చేసిందనే విమర్శ ఉంది. భారతదేశంలో మొత్తం బిలియనీర్ల సంఖ్య 2020లో ఉన్న102 నుండి 2023 నాటికి 170కి పెరిగింది. అదే సమయంలో ఆకలితో ఉన్న భారతీయుల సంఖ్య 19 కోట్ల నుండి 35 కోట్లకు పెరిగింది. చాలామంది సాధారణ భారతీయులు ప్రతి సంవత్సరం ఆరోగ్య సంరక్షణ ఖర్చుల కారణంగా పేదరికంలోకి నెట్టబడుతున్నారు.
ప్రపంచంలోని ఆహార భద్రత,పోషకాహార స్థితి 2023 ప్రకారం భారతదేశ జనాభాలో దాదాపు 74శాతం మంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోయారు. 39శాతం మంది -తగినంత ఆహారం తీసుకోలేకపోతున్నారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023 ప్రకారం భారతదేశంలో పురుషులు కార్మిక ఆదాయంలో 82శాతం సంపాదిస్తారు. అయితే మహిళలు 18శాతం మాత్రమే సంపాదిస్తారు.
10 శాతం మంది చేతిలో 80 శాతం సంపద
1947లో స్వాతంత్య్రం పొందిన భారతదేశం, 1992లో విదేశీ పెట్టుబడులకు మార్కెట్‌ను తెరిచినప్పటి నుండి బిలియనీర్ల సంఖ్య పెరిగింది. ఫోర్బ్స్ బిలియనీర్ ర్యాంకింగ్స్ డేటా ప్రకారం 1 బిలియన్ కంటే ఎక్కువ నికర సంపద కలిగిన భారతీయుల సంఖ్య 1991లో ఒకటి నుండి 2023 లో 170కి పెరిగింది. 2022-23 లో భారతదేశ జనాభాలో అత్యంత ధనవంతులైన 1శాతం మంది జాతీయ ఆదాయంలో 22.6 శాతంను నియంత్రించారు.
అలాగే దేశం మొత్తం సంపదలో 40.1శాతం కలిగి ఉన్నారు. 10 శాతం మంది చేతిలో 80 శాతం దేశ సంపద ఉండటం బాధాకరం. ఆసియాలోని ఇద్దరు అత్యంత సంపన్నులు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ , గౌతమ్ అదానీ భారతీయులే. దేశంలోని 10,000 మంది సంపన్న వ్యక్తులు సగటున రూ.22.6 బిలియన్ల సంపదను కలిగి ఉన్నారు. ఇది దేశ సగటు కంటే 16,763 రెట్లు ఎక్కువ.
అయితే అగ్రశ్రేణి 1 శాతం మంది సగటున 54 మిలియన్ల సంపదను కలిగి ఉన్నారు. థామస్ పికెట్టీ పారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ వరల్డ్ అసమానత ల్యాబ్ పేపర్ ప్రకారం 2022- 23 నాటికి టాప్ ఒక శాతం ఆదాయం, సంపద వాటాలు (22.6 శాతం, 40.1 శాతం) చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా ఉన్నాయి. భారతదేశ టాప్ ఒక శాతం ఆదాయ వాటా దక్షిణాఫ్రికా, బ్రెజిల్,అమెరికా కంటే అత్యధికంగా ఉంది. ధనవంతులు చాలా వేగంగా ధనవంతులవుతున్నారు, పేదలు ఇప్పటికీ కనీస వేతనం సంపాదించడానికి కష్టపడుతున్నారని ఆక్స్‌ఫామ్ నివేదిక పేర్కొంది.
అసలు కారణాలు
దేశంలో ఆర్థిక వృద్ధి ప్రయోజనాలు అసమానంగా పంపిణీ చేయబడ్డాయి. కొన్ని రాష్ట్రాలు, కొన్ని రంగాలు అసమానంగా ప్రయోజనం పొందుతున్నాయి. క్రోనీ క్యాపిటలిజం, అవినీతి పద్ధతులు,పక్షపాతం కారణంగా ఎంపిక చేసిన సమూహంలో సంపద పోగుపడుతోంది. జీఎస్టీలో 60శాతం వాటా అందించే సేవా రంగం ప్రధానంగా మహారాష్ట్ర, కర్ణాటక మొదలైన రాష్ట్రాల్లో కేంద్రీకృతమై ఉంది.
కోవిడ్--19 మహమ్మారి భారత జనాభాలో దిగువన ఉన్న 50శాతం మంది సంపద క్షీణతకు దారితీసింది. సంపన్నులకు అనుకూలంగా ఉండే లేదా ప్రగతిశీలత లేని పన్ను వ్యవస్థలు ఆదాయ అసమానతకు దోహదం చేస్తాయి. ప్రభుత్వం కార్పొరేట్ పన్ను స్లాబ్‌ను 30శాతంనుండి 22 శాతానికి తగ్గించింది. నాణ్యమైన విద్య,ఆరోగ్య సంరక్షణ లేకపోవడం తరతరాల పేదరికాన్ని శాశ్వతం చేస్తుంది.
ఆర్థిక చలనశీల తను పరిమితం చేస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, అట్టడుగు వర్గాల్లో విద్య లేకపోవడం, తక్కువ జీతంతో కూడిన ఉద్యోగాల్లో కొంతమంది చిక్కుకుపోవడం దిగువ,మధ్య తరగతి భారతీయు ల వృద్ధిని అణగారిస్తున్నాయి. సరళీకరణ, ప్రైవేటీకరణ, గ్లోబలైజే షన్ కారణంగా వ్యవసాయం , చిన్న తరహా పరిశ్రమలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.
కానీ సంస్కరణల నుండి టెలికాం , పౌర విమానయానం అత్యధిక ప్రయోజనం పొందా యి. భారతదేశంలోని శ్రామికశక్తిలో ఎక్కువ భాగం వ్యవసాయం,చిన్న తరహా పరిశ్రమలలో ఉపాధి పొందుతోంది. వీరిలో అధిక భాగం తక్కువ వేతనాలు పొందడంతో పాటుగా సామాజిక భద్రతకు నోచుకోవడం లేదు. కార్మిక విధానాలు- ఆర్థిక మార్కెట్లపై మాత్రమే దృష్టి పెట్టి ఉత్పాదక పెట్టుబడులపై నిర్లక్ష్యం వహించడం వల్ల ఆర్థిక రంగంలో సంపద కేంద్రీకరణకు దారితీయవచ్చు.
పరిష్కార మార్గాలు
100 మిలియన్ రూపాయల (పది కోట్ల) కంటే ఎక్కువ ఆస్తులు కలిగిన వ్యక్తులపై 2 శాతం సంపద పన్ను విధించడం ద్వారా భారతదేశం తన స్థూల దేశీయోత్పత్తిలో 2.73శాతం విలువైన వార్షిక ఆదాయాన్ని పెంచుకోవచ్చు. కనీసం అదే విలువ గల ఆస్తిపై 33శాతం వారసత్వపు పన్ను విధించడం ద్వారా మరింత ఆదాయాన్ని దేశం పొందవచ్చు. భారత దేశంలో 170 మంది బిలియనీర్లు ఉన్నారు.
వీరిపై 2 శాతం సంపద పన్ను ప్రతి సంవత్సరం రూ.1.6 లక్షల కోట్లకు పైగా సంపద వస్తుంది. ఇది పాఠశాలలు, ఆసుపత్రులు, పునరుత్పాదక ఇంధనం, మన భవిష్యత్తులో అనేక ముఖ్యమైన పెట్టుబడులకు చెల్లించవచ్చు. బేస్‌లైైన్ దృష్టాంతంలో రూ. 10 కోట్లకు మించిన నికర సంపదపై 2 శాతం వార్షిక పన్ను, రూ. 10 కోట్లకు మించిన ఎస్టేట్లపై 33 శాతం వారసత్వ పన్నుతో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో భారీగా 2.73 శాతం ఆదాయం సమకూరుతుంది. పేదలు, నిమ్న కులాలు, మధ్యతరగతి వర్గాలను ఆదుకోవడానికి ఇది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అనుకూలమైన వైఖరి, మహత్తర రాజకీయ నిర్ణయం అవుతుంది.
వ్యాసకర్త సెల్: 85010 61659.