30-12-2024 12:00:00 AM
సముద్రం ఏమంత అందమైందని?
మునివేళ్ళతో జుట్టు పాయల్ని
చెవుల కిరువైపులా సర్దుకుంటూ
ఎదురుచూసే తనక్కడ లేకపోతే
ఒళ్లు అలసే దాకా అలలెంత నాట్యం చేయనీ
చిరుకోపాన్ని దాచుకుని
కనిపించినప్పుడు చెట్టై పూసే ఆమె ముందు
సముద్రం ఏమంత అందమైంది కాదు
ఆమె పాదాలను తాకాలనే ఆరాటమే లేకపోతే
కెరటాలకు ఆ మాత్రం గుర్తింపు దక్కేది కాదు
తీరం మీద
మా ఇద్దరి పేర్లూ పక్కపక్కన ఉండక పోతే
సముద్రం మీద అంత గౌరవం కలిగేది కాదు
తన గాజుల పాటనే
మళ్ళీ మళ్ళీ పాడుకునే సముద్రానికి
రావాల్సిన దానికన్నా ఎక్కువ పేరే వచ్చింది
కేవలం ఆమెను చూడాలనే పిచ్చి ఆశతో
సూర్యుడు పుడతాడు
లోయ అంచున పట్టు తప్పి చీకట్లో కలిసిపోతాడు
అదంతా తన కోసమేనని
సముద్రం అనుకుంటే అనుకోనీ
గాజు సీసాలో దాచుకున్న ప్రేమ
అద్దం లాంటి ఇసుక గుండెల మీద పగిలిపోతుంది
నీళ్ళల్లో నగ్నంగా వినోదిస్తున్న చేప చెవిలో
రహస్యాన్ని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది
ఇప్పుడీ సముద్రాన్ని ఓదార్చడం
నా కొత్త దినచర్య.
సా.మూ (సాంబమూర్తి ఎల్)