calender_icon.png 12 January, 2026 | 1:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి కోసం కంకణబద్దులమై పనిచేద్దాం

11-01-2026 06:57:00 PM

- చేసిన ప్రతి పని పది కాలాలపాటు గుర్తుండేలా చేద్దాం 

- ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేద్దాం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్‌నగర్(విజయక్రాంతి): అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా ఉంది కంకణ బద్ధులమై పని చేద్దామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.   మహబూబ్‌నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ అధ్యక్షతన డీసీసీ కార్యాలయంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆశావహులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ అందుతున్నాయని, అందుకే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన ఫలితాలు వచ్చాయని తెలిపారు.

గత రెండు సంవత్సరాల కాలంలో మహబూబ్‌నగర్ పట్టణంలో రూ.2 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. గత పదేళ్లలో మహబూబ్‌నగర్‌ను మున్సిపల్ కార్పొరేషన్‌గా మార్చే అవకాశం ఉన్నప్పటికీ, కొందరి అధికార దాహం కారణంగా పట్టణ అభివృద్ధి నిర్లక్ష్యం చేయబడిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిని ఒప్పించి మహబూబ్‌నగర్‌ను మున్సిపల్ కార్పొరేషన్‌గా మంజూరు చేయించుకున్నామని స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదం, ప్రభుత్వ దృఢ సంకల్పంతో మహబూబ్‌నగర్ పట్టణానికి స్వర్ణయుగం ప్రారంభమైందని చెప్పారు.

గత రెండు సంవత్సరాలుగా రూ.100 కోట్లతో పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధి పనులు, రూ.603 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, రూ.20 కోట్లతో ఎంవీఎస్ డిగ్రీ కళాశాల నిర్మాణం, రూ.220 కోట్లతో పట్టణానికి శాశ్వత వాటర్ సప్లై పరిష్కారం, రూ.400 కోట్లతో ఐఐఐటీ కళాశాల నిర్మాణం చేపట్టామని వివరించారు.  రూ.100 కోట్లతో పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు, రూ.17 కోట్లతో ఫూలే–అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు, రూ.40 కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మరియు హాస్టల్స్ అభివృద్ధి, రూ.200 కోట్లతో సమీకృత పాఠశాలల ఏర్పాటు, రూ.300 కోట్లతో బైపాస్ రోడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించుకున్నామని తెలిపారు. మైనారిటీ సోదరులు ఎన్నో సంవత్సరాలుగా కోరుకుంటున్న భవనాల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ముఖ్యమంత్రి గారు రూ.45 కోట్లను మంజూరు చేశారని గుర్తు చేశారు.

- టికెట్ ఎవరికి వచ్చిన కలిసి పని చేయండి : ఎమ్మెల్యే

ఈ అభివృద్ధి పనులన్నీ ప్రజల దీర్ఘకాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టినవని, విద్య, మౌలిక సదుపాయాలు, నీరు, రహదారుల రంగాల్లో మహబూబ్‌నగర్ పట్టణాన్ని ఆధునిక నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పట్టణానికి స్వర్ణయుగానికి నాంది పడిందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 50 డివిజన్లకు మించిన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డికి మాట ఇచ్చామని తెలిపారు.

టికెట్ ఎవరికి కేటాయించినా నాయకులు, కార్యకర్తలు అందరూ ఐక్యంగా టికెట్ పొందిన అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.  ప్రజల సంపూర్ణ ఆశీర్వాదంతో అభివృద్ధి ప్రయాణం ఎప్పటికీ ఆగదని, మహబూబ్‌నగర్ పట్టణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే  స్పష్టం చేశారు. అనంతరం  నగరంలోని వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.