11-01-2026 07:10:00 PM
సామాన్యులపై కూర'గాయలు... పెరిగిన కూరగాయల రేట్లు...
సామాన్యుడిపై ఆర్థిక భారం... సంతల్లో సందడి కరువు...
పెరిగిన నిత్యవసర సరుకుల రేట్లు... అదుపు చేయడంలో పట్టని ప్రభుత్వం
బాన్సువాడ,(విజయక్రాంతి): దినసరి కూరగాయల షాపులు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. పెరిగిన కూరగాయల ధరలతో సామాన్యునిపై ఆర్థిక భారం పడుతుంది. అలాగే కిరాణా నిత్యవసర సరుకుల ధరలు సైతం రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి. నిలకడగా లేని ధరలతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. వంటకు కావలసిన పప్పు దినుసులు, నూనెలు, ఇతరాత్ర సరుకుల రేట్లు సైతం పెరగడం వల్ల కిరాణా వర్తక షాపులు సైతం అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి.
ఉత్పత్తి తగ్గడం ఒక కారణమైతే, హోల్సేల్ వ్యాపారులు పెంచుతున్న ధరలు మరో కారణమవుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ పాలకులు సైతం పట్టనట్లు వివరించడం, పల్లె,పట్టణ జనం పై ఆర్థిక భారం పడుతోంది. వంద రూపాయలు చేత పట్టుకుని కూరగాయల మార్కెట్ కి వెళ్తే అన్ని దొరికే రోజులు దూరమవుతున్నాయి. నేటి పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. కూరగాయల ధరలు పెరిగిపోవడం వల్ల కూలి నాలి చేసుకునే వ్యక్తులు కూరగాయలనుకునే పరిస్థితి లేకుండా పోయింది.
వాస్తవానికి వర్షభావ పరిస్థితుల కారణంగా కూరగాయల పెంపకం చాలా తగ్గుముఖం పట్టింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కొనుగోలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. గత నాలుగు మాసాల క్రితం కూరగాయల ధరలు చాలా తగ్గినట్టుగా ఉండేవి. కానీ వ్యాపారస్తులు ఇప్పుడు ఎక్కువ మొత్తంలో అమ్మడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో కూరగాయల ధరలు వింటుంటేనే గుండె దడ పుట్టుకొస్తుంది. ప్రస్తుతం ఒక్క రోజుకు కూరగాయలు కావాలంటే రూ. 200 దగ్గర ఉంటేనే ఇంటికి చేరుకునే పరిస్థితి లేకుండా పోయింది.
కిరాణా సరుకుల పరిస్థితి అంతే...
కిరాణా సరుకుల విషయంలో కూడా కందిపప్పు, మినప పప్పు, పెసరపప్పు ధరలు కూడా పెరిగాయి. గతంలో 50 రూపాయల కిలో పెసరపప్పు పలికిన ధర ప్రస్తుతం వంద రూపాయలకు అమ్ముడు పోతుంది. అదేవిధంగా నిత్యవసర ధరలు సైతం పెరిగిపోవడం వల్ల కూలీ నాలి చేసుకునే వ్యక్తులు వారి వారి కుటుంబ పోష నిమిత్తం ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది.
బతుకులు ఎలా సాగాలి...
కూరగాయల పంట సాగును చేసుకునేందుకు ధరణి న మ్ముకున్న రైతులు కష్టపడేవారు. పంట కావలసిన పెట్టుబడి పెట్టి లాభాలను అర్జించేవారు. కూరగాయల సాగుపై ప్రకృతి కన్నెర్ర చేయడం, కూరగాయల సాగుపై రైతులు ఆసక్తి చూపకపోవడం, సాగు పరిస్థితులు భారీగా తగ్గుముఖం పట్టడంతో కూరగాయల ధరలు పెరగడానికి అవకాశం ఏర్పడింది.
సంతలు వెల వెల...
ధరలు పెరగడంతో వారపు సంతలు వెలవెలబోతున్నాయి. వినియోగదారుల సందడి లేక ఫుట్పాత్ వ్యాపారం ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి ధర ఘాటె కుతోంది. టమాట ధరలు రెండింతలు అయ్యాయి. దోసకాయ,వంకాయ, బెండకాయ, ధరలు కూడా కిలోకు 30 నుండి 40 రూపాయలు పెంచి అమ్ముతున్నారు. ఆకుకూరల ధరలు సైతం అదేవిధంగా ఉన్నాయి. చివరకు పచ్చి మసాలా ధరలు కూడా పెరగడంతో కొనేందుకు వినియోగదారులు జంకుతున్నారు. దినసరి కూరగాయల మార్కెట్లో సైతం రిటైల్ వ్యాపారులు కూరగాయల ధరలను మరింత పెంచేస్తున్నారు.
ప్రభుత్వం అదుపు చేయాలి..
కిరాణా సరుకుల ధరలతో పాటు, కూరగాయల రేట్లు కూడా తగ్గించేందుకు ఉంది. వెంటనేఉత్పత్తిదారులతోపాటు, హోల్సేల్ వ్యాపారులతో సమావేశమై ధరలను తగ్గించే ప్రయత్నం చేయాలి. సామాన్యుడుపై ఆర్థిక భారం పడకుండా ధరల అదుపుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.బడుగు జీవికి కుటుంబ పోషణ కోసం చాలీచాలని వేతనంతో వచ్చే ఆర్థిక డబ్బులు ఖర్చు చేయడం కష్టంగా మారింది.
పెరుగుతున్న నిత్యవసర ధరలు కూరగాయలు కొందామంటే అప్పట్లో వంద రూపాయలు ఖర్చు చేస్తే ఇంటికి సరిపడేంత వచ్చేవి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏమి కొందామన్న 200కు మించి కూరగాయలు ఇంటికి చేరి పరిస్థితి లేకుండా పోయింది. దేవునికి దీపం పెట్టే పామ్ ఆయిల్ కూడా 150 రూపాయలకు చేరింది. ప్రైవేటు జాబులు అనుభవిస్తూ పది, పదిహేను వేల రూపాయల్లో ఇంటి ఖర్చులు పోను మిగిలింది ఏమాత్రం వస్తుందన్న విషయాన్ని పాలకులు గుర్తించాలి.