31-01-2026 06:07:28 PM
అశ్వాపురం,(విజయక్రాంతి): అశ్వాపురం మండలం బారాజల కర్మాగారంలో ఏర్పాటు చేయనున్న ఆక్సిజన్–18 (O-18) ప్లాంటుకు శంకుస్థాపన చేసేందుకు శనివారం అణుశక్తి కమిషన్ చైర్మన్ డా. ఏ.కే. మహంతి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితీష్ వి. పాటిల్ ఘనంగా స్వాగతం పలికారు.
భారత అణుశక్తి శాఖ (DAE)కు చెందిన హెవీ వాటర్ బోర్డు ఆధ్వర్యంలో ఈ ప్లాంటు ఏర్పాటు కానుంది. ఈ ఆక్సిజన్–18 సమృద్ధి చేసిన నీటిని పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (PET) స్కాన్‌లలో క్యాన్సర్ కణాలు, దుష్ట కణితులను గుర్తించేందుకు విస్తృతంగా ఉపయోగిస్తారు. అలాగే, మెడికల్ సైక్లోట్రాన్‌లలో రేడియో ఫార్మాస్యూటికల్స్ తయారీలో ఇది కీలక పాత్ర పోషించనుంది.
దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతికతతో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంటు ప్రారంభం కావడం ద్వారా, భారతదేశ వైద్య రంగానికి అవసరమైన ఆక్సిజన్–18 సమృద్ధి చేసిన నీటి అవసరాలను స్వదేశీగా తీర్చగల సామర్థ్యం మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా PET స్కాన్ కేంద్రాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్లాంటు భారత ఆరోగ్య వ్యవస్థకు గణనీయమైన తోడ్పాటునిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హెవీ వాటర్ బోర్డు ఉన్నతాధికారులు, అణుశక్తి శాఖ ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బారాజల కర్మాగారంలో ఆక్సిజన్–18 ప్లాంటు ఏర్పాటు ద్వారా అశ్వాపురం ప్రాంతానికి పారిశ్రామికంగా మరింత ప్రాధాన్యం లభించనుందని స్థానికులు అభిప్రాయపడ్డారు.