ఒకే కుటుంబంలో నలుగురు మృతి
కుళ్లిన స్థితిలో మృతదేహాలు
హత్యా, ఆత్మహత్యా?
నల్లగొండలోని తెలంగాణ కాలనీలో ఘటన
నల్లగొండ క్రైం, జూన్ 22 (విజయక్రాంతి): నల్లగొండ పట్టణంలోని సాగర్‌రోడ్డు తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. సోమవారం రాత్రి కుళ్లిన స్థితిలో మృతదేహాలు లభ్యమయ్యాయి. దుర్వాసన రావడంతో సమీప కాలనీవాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పరిశీలించిన పోలీసులు నాలుగు మృతదేహాలను గుర్తించారు. మృతుల్లో దంపతులు మహమ్మద్ సుల్తాన్, హసీనా, అదే కుటుంబానికి చెందిన మరో ఇద్దరు మృతదేహాలు కుళ్లిన స్థితిలో ఉన్నాయి.
మరో యువతి, వృద్ధుడి మృతదేహం ఉండటంతో సుల్తాన్ తండ్రి, కుమార్తెగా భావిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. హసీనా ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా, సుల్తాన్ ప్రకాశం బజార్‌లో బ్యాగుల వ్యాపారంలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారా లేక ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యా ప్తు చేస్తున్నారు. ఎస్పీ శరత్ చంద్ర పవర్, అడిషనల్ ఎస్పీ రమేష్ ఘటన స్థలాన్ని పరిశీలించారు.






