calender_icon.png 14 May, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగాల పేరుతో మోసం

14-05-2025 12:41:15 AM

  1. రూ.10 వేల నగదు, రెండు సెల్ ఫోన్లు, బైకు స్వాధీనం 
  2. వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీ కె. శివరాంరెడ్డి 

నల్లగొండ టౌన్, మే 13 : కోర్టు ఉద్యోగాల పేరుతో 31 మంది నిరుద్యోగ మహిళలను మోసగించి వారి వద్ద రూ.10.32  లక్షలు వసూలు చేసిన నల్లగొండ పట్టణానికి చెందిన న్యాయవాది గాజుల జ్యోతి @ జ్యోతి రాణి, పద్మ నగర్ కాలనీకి చెందిన అడ్వకేట్ క్లర్క్  మొహమ్మద్ నసీర్ను  అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు  నల్లగొండ డీఎస్పీ కె శివరామిరెడ్డి తెలిపారు.

మంగళవారం నల్లగొండ నియోజకవర్గంలోని తిప్పర్తి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత కొంతకాలంగా నల్లగొండ జిల్లా కోర్టులో స్వీపర్, అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. కోర్టు పరిసరాలను కేంద్రంగా చేసుకుని నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారని సమాచారంతో నల్లగొండ ఎస్పి శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం ఈ కేసును తిప్పర్తి పోలీసులు ఛేదించి నిందితులను పట్టుకున్నారు.

31 మంది నిరుద్యోగ మహిళల నుంచి రూ.10.32 లక్షలు వసూలు చేసిన మహమ్మద్ నసిర్, గాజుల జ్యోతి @ జ్యోతి రాణిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తిప్పర్తి మండలం ఇండ్లూరుకు చెందిన ఏపురి హెప్సిబా అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 7 న తిప్పర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది.

విచారణలో నిందితులైన మహమ్మద్ నసీర్, గాజుల జ్యోతి @ జ్యోతి రాణి అమాయక నిరుద్యోగ మహిళలకు జిల్లా కోర్టులో కాంట్రాక్ట్ స్వీపర్, అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసపూరిత హామీలు ఇచ్చి కొంతమంది వద్ద రూ.50వేలు, మరికొంత మంది నుంచి రూ.20 వేల నుంచి రూ. 30 వేల చొప్పున వసూలు చేసినట్లు తేలింది.

విచారణలో మొత్తం 31 మంది బాధితులు నల్లగొండ, తిప్పర్తి, మాడ్గులపల్లి మండలాలకు చెందిన వారి వద్ద నుండి మొత్తం రూ.10.32 లక్షలు అక్రమంగా వసూలు చేసినట్లు తేలింది. వీరిపై తిప్పర్తి పోలీస్ స్టేషన్లో 4, నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు నమోదయ్యాయి.

వీరి నుండి రూ.10వేల నగదు, రెండు సెల్ ఫోన్లు, ఒక బైకును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన శాలిగౌరారం సీఐ కె.కొండల్ రెడ్డి, తిప్పర్తి ఎస్‌ఐ   బి.సాయి ప్రశాంత్, సిబ్బంది  శ్రీనివాస్ రెడ్డి, రామ్ రెడ్డి   బృందాన్ని ఎస్పీ శరత్ చంద్ర ప్రత్యేకంగా అభినందించారు.