calender_icon.png 10 September, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధర్మారంలో అధర్మం

10-09-2025 04:30:13 PM

చీకటి పడ్డాక యూరియా బస్తాల అక్రమ తరలింపు

కాపు కాసి అడ్డుకున్న రైతులు....

పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) ధర్మారం మండలంలో అధర్మం బయటపడింది. మండలంలోని కటికనపల్లి గ్రామంలో గల అన్నదాత ఆగ్రోస్ కేంద్రం గోదాం నుంచి మంగళవారం రాత్రి అక్రమంగా ట్రాక్టర్, ఆటోలో అక్రమంగా యూరియాను తరలించే ప్రయత్నం చేయగా గ్రామ రైతులు అడ్డుకున్నారు. మంగళవారం సాయంత్రం ఆగ్రోస్ కేంద్రానికి 220 యూరియా బస్తాలు రాగా, వాటిని బుధవారం రైతులకు స్థానిక ఏఈఓ సమక్షంలో పంపిణీ చేయాల్సి ఉంది. నిబంధనల ప్రకారం యూరియాను రైతుల ఆధార్, పట్టాదార్ పాస్ పుస్తకం ఆధారంగా ప్రత్యేక యాప్ లో వారి పేర్లను నమోదు చేసి ఓటిపి వచ్చిన తర్వాత పంపిణీ చేస్తారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా సుమారు రాత్రి పది గంటల సమయంలో గోదాం నుంచి దుకాణం యజమాని దొంగ చాటుగా యూరియా బస్తాలను విక్రయించే ప్రయత్నం చేయగా రైతులు  గుట్టురట్టు చేశారు.

22 యూరియా బస్తాలను ట్రాక్టర్ ,ఆటోలో తరలిస్తున్నట్లు సమాచారం తెలియడంతో రైతులు అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు. ఒక్కో రైతుకు ఒక బస్తా యూరియా ఇస్తుండగా పెద్ద మొత్తంలో యూరియా బస్తాలను ఎలా విక్రయిస్తారని రైతులు నిలదీశారు. ఈ సంఘటనను  గ్రామస్తులు కొందరు తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో యూరియా తరలింపు పై పోస్టులు చేయడంతో దావనంల వ్యాపించింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వాహనాల్లోని యూరియాను తిరిగి గోదాంలోకి తరలించారు.