ప్రతినెల 2వ గురువారం ఉచిత క్యాన్సర్ శిబిరం
- మొదటి శిబిరంలో 186 మందికి పరీక్షలు.. 26 మందికి పాజిటివ్
- మెడికవర్‌లో నిర్వహణ
కరీంనగర్, ఆగస్టు 13(విజయక్రాంతి): క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్సతో వ్యాధి నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుందని హైదరాబాద్ మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ అంకాలజిస్టులు డాక్టర్ అన్వేష్, డాక్టర్ నీలేష్, డాక్టర్ స్నేహ సూచించారు. కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో గురువారం నిర్వహించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరానికి మొత్తం 186 మంది హాజరై పరీక్షలు చేయించుకోగా, 26 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు.
క్యాన్సర్ కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఇకపై ప్రతి నెల రెండో గురువారం కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు డాక్టర్లు తెలిపారు.ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందస్తు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో వైద్యులు మాట్లాడుతూ కరీంనగర్‌లో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని తెలిపారు.
మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ రావడం వ్యాధి తీవ్రతను తెలియజేస్తుందన్నారు. అయితే క్యాన్సర్ లక్షణాలు స్పష్టంగా బయటపడకముందే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధిని తొలిదశలో గుర్తించి తగిన చికిత్స అందించవచ్చన్నారు.
క్యాన్సర్ బారిన పడకుండా కొంతమందినైనా కాపాడాలనే ఉద్దేశంతో మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలను నిర్వహిస్తోందని వైద్యులు తెలిపారు. ముందస్తు గుర్తింపు, సరైన సమయంలో చికిత్స, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా క్యాన్సర్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు. మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సెంటర్హెడ్ సంపత్, మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, పీఆర్ అబ్దుల్వకీల్ తదితరులు పాల్గొన్నారు.






