03-08-2025 07:45:21 PM
గచ్చిబౌలి: తెలంగాణ పారా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో జూనియర్, సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్–2025 ఆగస్టు 5న గచ్చిబౌలి స్టేడియంలో జరగనుంది. ఈ విషయాన్ని సంఘ అధ్యక్షుడు విస్లావత్ శేఖర్ బ్రోచర్ ఆవిష్కరణ సందర్భంగా ప్రకటించారు. ఈ పోటీలలో రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే పిల్లలు, యువ అథ్లెట్లు తమ అద్భుత ప్రతిభను ప్రదర్శించనున్నారు. 100, 200, 400 మీటర్ల ట్రాక్ ఈవెంట్ తో పాటు లాంగ్ జంప్, షాట్‌పుట్, జావలిన్ త్రో వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు.
ఈ ఛాంపియన్‌షిప్ ద్వారా ప్రతిభావంతులైన అథ్లెట్లను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. ప్రత్యేక అవసరాల కలిగిన పిల్లల ప్రతిభను వెలికితీయడం, వారికి సమాన అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమానికి ప్రముఖ క్రీడా అధికారులు, సమాజ సేవకులు విశిష్ట అతిథులు హాజరవుతారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.