20-09-2025 08:24:37 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): ఆర్థికంగా బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలు లభిస్తాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా చైర్మన్ డాక్టర్ వివిఆర్ వరప్రసాద్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పీజేఆర్, స్ఫూర్తి డిగ్రీ కళాశాల విద్యార్థులకు న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన పలు సలహాలు చేయడంతో పాటు చట్టంలోని హక్కుల పై అవగాహన కల్పించారు. న్యాయ సేవాధికార చట్టం 1987, చట్ట సేవల పరిరక్షణ, లోక్ అదాలత్ లు, ఉచిత న్యాయ సేవలు, భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, మౌలిక హక్కుల పరిరక్షణ, ఉచిత న్యాయ సహాయం సేవల ప్రాధాన్యత వంటి అంశాలపై వివరణాత్మకంగా విద్యార్థులకు తెలిపారు.
న్యాయం అందరికీ సమానంగా లభించాలి. అందులో చట్ట సేవలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. సాధారణ ప్రజలు తమ హక్కులను గౌరవించి, వినియోగించుకోవడంలో న్యాయవ్యవస్థ ఎంత అవసరమో స్పష్టంగా తెలిపారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి నాగరాణి సమాజంలో మహిళల సాధికారత అవసరం, మహిళల హక్కుల పరిరక్షణలో న్యాయ సేవల పాత్ర పై వివరించారు. మహిళలు అని రంగాల్లో సమాన హక్కులు, సురక్షిత వాతావరణం పొందేందుకు తమ సమస్యలను చట్టపరంగా పరిష్కరించుకునేందుకు ఉచిత న్యాయ సాయం ఎంత ముఖ్యమో తెలిపారు. ఏవైనా సమస్యలు అయితే నల్సా టోల్ ఫ్రీ నెంబర్ 1500 ద్వారా సాయం పొందవచ్చని సూచించారు.