06-09-2025 04:58:30 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): చదువుతూనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, చదువుకు పేదరిక బేధం లేదని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించడమే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వ లక్ష్యం ఆన్నారు.
మహబూబాబాద్ లో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల కోసం 70 ఎకరాలు స్థలం కేటాయించడం జరిగిందని, అన్ని వసతులతో కొత్త భవనం నిర్మించబోతున్నామన్నారు. హాస్టల్ విద్యార్థుల కష్టాలు తెలుసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థినీ విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచడం జరిగిందని తెలిపారు. గత పదేళ్లుగా నిర్లక్ష్యంగా మారిన విద్యలో మార్పు తీసుకువచ్చి, పేద విద్యార్థులకు మెరుగైన విధంగా విద్యను అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగి తల్లిదండ్రుల ఆశాయలను నెరవేర్చాలన్నారు.