20-09-2025 08:34:53 PM
పాపన్నపేట (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రథమ సంవత్సర విద్యార్థులకు స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేసారు. కళాశాల ప్రిన్సిపల్ నర్సింలు, అధ్యాపకులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రిన్సిపల్ నర్సింలు విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత పాఠ్యపుస్తకాలు, నిష్ణాతులైన అధ్యాపకులు, డిజిటల్ తరగతి గదులతో పాటు అన్ని రకాలైన వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. విద్యార్థుల జీవితంలో ఇంటర్మీడియట్ అనేది కీలకమైన స్థాయని, ఈ దశలో మనం చేసే కృషి ద్వారానే మన భవిష్యత్తు నిర్ణయించబడుతుందని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు సైతం కళాశాల పట్ల తమకు గల అనుభవాలు, అనుభూతులు పంచుకున్నారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా కార్యక్రమాన్ని ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సతీష్, శ్రీనివాస్, సంతోష్, రమేష్, సంధ్యారాణి, నవీన్ కుమార్, మధుసూదన్, సిబ్బంది పాల్గొన్నారు.