calender_icon.png 11 October, 2025 | 9:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిధులు రాక..నిర్మాణం సాగక

11-10-2025 01:02:03 AM

  1. సగానికే నిలిచిపోయిన... సమీకృత మార్కెట్...
  2. రోడ్లపై తోపుడు బండ్లు తొలగింపుతో చిరువ్యాపారస్తుల ఇబ్బందులు
  3. ప్రభుత్వ అసత్వం... అధికారుల నిర్లక్ష్యం వెరసి అగమ్యగోచరంలో కోట్ల నిధులు పనులు

ఆదిలాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాం తి) : ప్రజల సౌకర్యార్థం పువ్వులు... పండ్లు... మటన్... చికెన్... చేపలు... కూరగాయలు... ఇలా అన్ని ఒకే చోట విక్రయించేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు సగానికే నిలిచిపోయయి.  జిల్లా కేంద్రంలోని సాత్నాల క్వార్టర్స్ ప్రాంతంలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనుల పరిస్థితి గత 4 ఏళ్లుగా ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. ఈ పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.

గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన పనులకు పూర్తిస్తాయిలో నిధులు విడుదల కాకపోవడంతో నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ప్రభుత్వం సకాలంలో నిధులు విడు దల చేస్తే సమీకృత మార్కెట్ నిర్మాణం 2022 అక్టోబరు నెలాఖరుకే  ప్రజలకు అందుబాటులోకి వచ్చి ఉండేది.

ప్రస్తుతం పట్టణ జనాభా పెరుగుదలతో ట్రాఫిక్ ఇబ్బందులు నెలకొంటున్నాయని రోడ్లపై తోపుడు బండ్లతో విక్రయాలు సాగించే చిరు వ్యాపారస్తుల తోపుడు బండ్లను ఇటీవల అధికారులు పోలీసులు తొలగించారు. దీంతో ఈ సమీకృత భవన నిర్మాణం అందుబాటులోకి రాకపోవడంతో చిరు వ్యాపారస్తులు విక్రయాలు జరిపేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ఒకేచోట అన్ని లభించేలా..

ప్రజలు తమకు కావలసిన కూరగాయలు, పండ్లు, పువ్వులు, మటన్, చికెన్, చేపలు ఇలా వివిధ సామాగ్రిని కొనుగోలు చేసుకునేందుకు పట్టణంలోని వేరువేరు ప్రాంతాలకు వెళ్లి ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని గత బీఅర్‌ఎస్ ప్రభుత్వం అన్నీ ఒకే చోట లభించేలా సమీకృత మార్కెట్ల నిర్మాణానికి రూపకల్పన చేసింది.

దీంతో  మున్సిపల్ పరిధిలోని సాత్నాల క్వార్టర్స్ వద్ద 3.78 ఎకరాల స్థలంలో రూ. 7.20 కోట్ల నిధులతో ఈ సమీకృత భవన నిర్మాణానికి నిధులు  మంజూరయ్యాయి. ఈమేరకు అప్పటి ఎమ్మెల్యే జోగు రామన్న 2021, డిసెంబరు 23న సమీకృత మార్కెట్ నిర్మాణ పనులను భూమిపూజ చేసారు. ఇందులో మాంసాహార బ్లాక్ లో 50 గదులు, శాకాహార బ్లాక్ 70 గదులతో  నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు.

మార్కెట్ కు వచ్చే ప్రజల వాహనాలతో ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ సదుపాయం సైతం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత 4 ఏళ్లుగా ఆగుతూ సాగుతూ ఇప్పటిదాకా దాదాపు రూ. 3 కోట్ల వరకు పనులు పూర్తయ్యాయి. కాంట్రాక్టర్ పూర్తి చేసిన పనులకు దశల వారీగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. దాదాపు రూ.1.20 కోట్ల వరకే బిల్లు వచ్చింది. దీంతో కాంట్రాక్టర్ పనులను అర్ధాంతరంగా నిలిపివేయడంతో నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. 

ప్రభుత్వం దృష్టి సారిస్తేనే...

సమీకృత మార్కెట్ నిర్మాణానికి రూ. 7.20 కోట్లు మంజూరైనా ప్రస్తుత స్థానిక పరిస్థితులను బట్టి మొత్తం రూ.9 కోట్ల వరకు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. అదనంగా అయ్యే రూ.2 కోట్ల నిధులను పట్టణ ప్రగతి నిధుల నుంచి వినియోగించుకోవాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చాయి.

అయితే ఇప్పటికే చేపట్టిన పనులకే  నిధులు రాకపోవడంతో, కొత్తగా మార్కెట్ నిర్మాణానికి ఎక్కడి నుంచి నిధులు సమీకరించుకోవాలో మున్సిపల్ యంత్రాంగానికి అంతుపట్టడం లేదు. దీంతో ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమీకృత మార్కెట్ భవన నిర్మా ణంపై దృష్టి సారించి, పెండింగ్ నిధులను  కేటాయిస్తే నిర్మాణ పనులు ముందుకు సాగే అవకాశం ఉంది. 

ఎలా ముందుకు వెళ్ళాలో.. 

సమీకృత మార్కెట్ కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మాణ పనులు ప్రారంభించినప్పటికీ,  నిధుల కొరతతో పాటు యితర కారణలతో ఈ భవనాన్ని ఆడిటోరియం కోసం కానీ లేదా ఏ ఇతర భవనాలకైనా ఉపయోగించుకోవాలని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సూచించింది. దీంతో అధికారులు సైతం ఎలా ముందుకు వెళ్ళాలో అనే తర్జన బర్జనలో ఉన్నారు.

అటు రోడ్లపై ఉన్న తోపుడు బండ్లను తొలగించడంతో చిరు వ్యాపారస్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, అదేవిధంగా పలు సామాగ్రి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్ళే బదులు ఒకే చోట కొనుగోలు చేసేలా ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని సమీకృత మార్కెట్ భవన నిర్మాణ పనులు త్వరగా చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం

మున్సిపల్ పరిధిలో నిర్మించే సమీకృత మార్కె ట్ భవన నిర్మాణానికి నిధుల కొరత కారణంగా పను లు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం రూ. 7.20 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ నిధులు పూర్తిగా విడుదల కాకపోగా అర్థంతరంగానే పనులు నిలిచిపోయాయి. మరోవైపు ప్రభుత్వం ఈ భవనాన్ని ఆడిటోరియం, లేదా ఇతర దీనికైన వినియోగించుకోవాలని సూచించడంతో ఈ విషయాన్ని త్వరలో జిల్లా ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.

 సివిఎన్ రాజు,మున్సిపల్ కమిషనర్, ఆదిలాబాద్.