29-09-2025 12:38:37 AM
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు, బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఉమేశ్ కుమార్ బన్సాల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్హల్, నిఖిల్ నందా నిర్మాతలు.
పౌరాణిక ఇతివృత్తాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దివ్య ఖోస్లా, శిల్పా శిరోధ్కర్, ఇంద్రకృష్ణ, రవి ప్రకాశ్, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్ వివిధ పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌కు మంచి ఆదరణ లభించింది. ఇటీవల ఫస్ట్ ట్రాక్ గా రిలీజ్ అయిన ’సోల్ ఆఫ్ జటాధార’కూ మంచి స్పందన వచ్చింది.
అయితే, విజయదశమి కానుకగా ఈ సినిమా నుంచి అక్టోబర్ 1న ధన పిశాచి సాంగ్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ టీమ్ ఆదివారం రిలీజ్ చేసిన సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుందీ చిత్రం.