23-01-2026 08:41:47 PM
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజల్లో అవగాహన కల్పించాలి
నెలవారీ నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ నితిక పంత్ ఆదేశాలు
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఎస్పీ నితిక పంత్ నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పోలీస్ అధికారులతో ఎస్పీ మాట్లాడుతూ ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్తులకు శిక్ష పడేలా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. కేసుల విచారణలో జాప్యం చేయరాదని, పోలీస్ అధికారులు అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాల ద్వారా అధికారులు, సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, డయల్ 100 కాల్స్‌కు వేగంగా స్పందించాలని సూచించారు.
రాబోయే గంగాపూర్ జాతర, బాళేశ్వర స్వామి జాతరల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అనంతరం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు, మట్కా, జూదం, బెట్టింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని తెలిపారు.
సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించి, నివాస ప్రాంతాలు, వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. ప్రాపర్టీ కేసుల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించి నేరస్తులను పట్టుకుని, దొంగతనమైన సొత్తును రికవరీ చేసి బాధితులకు త్వరితగతిన అందేలా చూడాలని అన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేసేలా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని, సైబర్ నేరాల్లో నగదు కోల్పోయిన బాధితులు వెంటనే ఫిర్యాదు చేసినప్పుడు తక్షణమే స్పందించి అండగా ఉండాలని సూచించారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి, సంబంధిత శాఖలతో సమన్వయం పాటిస్తూ ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం చేకూరేలా పనిచేయాలని అన్నారు. నాకాబందీ, కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్‌ను క్రమం తప్పకుండా నిర్వహించాలని, రానున్న మున్సిపల్ ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టిన “అరైవ్ అలైవ్” కార్యక్రమం ద్వారా ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, రాష్ డ్రైవింగ్ ద్వారా ప్రమాదాలకు కారణమయ్యే వారిపై నిరంతర వాహన తనిఖీలు చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్, కాగజ్‌నగర్ డీఎస్పీ వాహిదుద్దీన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ సతీష్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ రవీందర్‌తో పాటు జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.