23-01-2026 08:48:30 PM
నీతి అయోగ్ సిఈఓ సుబ్రహ్మణ్యం
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): సంపూర్ణత అభియాన్ 2.0 కార్యాచరణ రూపొందించాలని నీతి అయోగ్ సిఈఓ సుబ్రమణ్యం అన్నారు. శుక్రవారం దేశ రాజధాని న్యూఢిల్లీ నుండి నీతి అయోగ్ ఇతర అధికారులతో కలిసి దేశంలోని 112 జిల్లాలు 513 బ్లాక్ అధికారులు - కలెక్టర్లు, విద్య, వైద్య, వ్యవసాయ, శిశు సంక్షేమ, గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సి ఈ ఓ మాట్లాడుతూ సంపూర్ణత అభియాన్ 2.0 పథకం కార్యచరణ ప్రణాళిక జనవరి 28 నుండి ఏప్రిల్ 14వ తేదీ వరకు చేపట్టాలని, ఈ పథకం జనవరి 28 నుండి ఫిబ్రవరి 2వ తేదీ మధ్య లాంచ్ చేయడం జరుగుతుందని తెలిపారు.
సంపూర్ణత అభియాన్ పథకం క్రింద విద్య, వైద్యం, పిల్లలకు, గర్భిణులకు పోషక ఆహారం, చిన్నపిల్లల ఆరోగ్యం, పాఠశాలలలో బాలికలకు ప్రత్యేక మూత్రశాలలు, వ్యవసాయ ఆధారిత భూసార పరీక్షలు, పశువులకు టీకాలు వంటి కార్యక్రమాలు 90 రోజులపాటు చేపట్టాలని తెలిపారు.. ఈ కార్యక్రమాలలో ప్రజా ప్రతినిధులు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలను భాగస్వామ్యులను చేయాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ కె.హరిత, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారితో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంపూర్ణత అభియాన్ 2.0 పథకంలో భాగంగా జనవరి 28 నుండి ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఆకాంక్షిత తిర్యాణి బ్లాక్, జిల్లా బ్లాక్ లో కార్యక్రమాలు చేపడతామని, ఇందులో అందరిని భాగస్వాములను చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాం, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి, నీతి అయోగ్ జిల్లా సమన్వయకర్త బాలరాజు పాల్గొన్నారు.