26-08-2025 07:01:01 PM
వనపర్తి,(విజయక్రాంతి): పర్యావరణ హితమై ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో కాకుండా మట్టి విగ్రహాలను మాత్రమే నెలకొల్పాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ఖీమ్యా నాయక్ సూచించారు. ఆగస్టు 27న వినాయక చవితి వేడుకలను పురస్కరించుకొని మంగళవారం ఐడిఒసి సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ శాఖ ఆధ్వర్యంలో వినాయక మట్టి విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్యతో కలిసి మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్ లో అమ్ముతున్న వినాయక విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్, పర్యావరణానికి హాని కలిగించే రంగులతో తయారు చేసి అమ్ముతున్నారని, వాటిని పూజ అనంతరం నీటిలో నిమజ్జనం చేయడంతో నీరు కాలుష్యమై పర్యావరణానికి హాని కలిగిస్తుందన్నారు. రంగులు పర్యావరణం,నీరు కాలుష్యం కావడమే కాకుండా చాలా రోజుల వరకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహం నీటిలో త్వరగా కరిగిపోకుండా ఉంటుందని తెలిపారు.
అందువల్ల మట్టి విగ్రహాలను మాత్రమే నెలకొల్పి పూజించడం వల్ల పర్యావరణాన్ని కాపాడినవారవుతారని తెలియజేశారు. బి.సి. సంక్షేమ శాఖ, కాలుష్య నియంత్రణ సంస్థ ద్వారా వనపర్తి జిల్లా ప్రజలకు 2000 మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ నిమిత్తం కాలుష్య నియంత్రణ మండలి ద్వారా రూపొందించిన ప్రచార గోడ పత్రికను ఆవిష్కరించారు.