21-12-2025 12:00:00 AM
టీ20 వరల్డ్‌కప్ టీమ్‌లో నో ప్లేస్
ముంబై , డిసెంబర్ 20 : సొంతగడ్డపై జరగబోతున్న టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును ప్రకటించారు. ఎవ్వరూ ఊహించని విధంగా సంచలన నిర్ణయం చోటు చేసుకుంది. వైస్ కెప్టెన్ శుభమన్ గిల్‌పై వేటు పడింది. పేలవ ఫామ్‌లో ఉన్న గిల్‌కు వరల్ కప్ జట్టులో చోటు దక్కలేదు. వైస్ కెప్టెన్సీగా ఎంపిక చేసి, ఫ్యూచర్‌లో టీ20 జట్టుకు సారథిగా చేస్తారని వార్తలు వస్తున్న వేళ గిల్‌కు మెగాటోర్నీలో చోటు దక్కకపోవడం ఆశ్చర్యమే.
గిల్ కోసం సంజూ కెరీర్ నాశనం చేస్తున్నారంటూ వస్తున్న విమర్శలు ఎక్కువవడంతో సెలక్టర్లు తలొగ్గక తప్పలేదు. వచ్చే ప్రపంచకప్‌లో అభిషేక్ శర్మ , సం జూనే ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు. తిలక్ వర్మ, హార్థిక్ పాం డ్యా. శివమ్ దూబేల ఎంపిక ఊహించిందే. సౌతాఫ్రికాతో చివరి టీ20లో తిలక్ దుమ్మురేపాడు. ఇక పాండ్యా కూడా అదరగొట్టేశాడు. పాండ్యా, దూబేలు పేస్ ఆల్ రౌండర్లుగా కీలకం కాబోతున్నారు. అయితే వికెట్ కీపర్ జితేశ్ శర్మకు కూడా సెలక్టర్లు షాకిచ్చారు.
అతన్ని ప్రపంచకప్‌కు ఎంపిక చేయలేదు. అతని స్థానంలోనే జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ చాలా రోజుల తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో వ్యక్తిగతంగా రాణించడంతో పాటు జార్ఖండ్ ను విజేతగా నిలబెట్టాడు. రెండు సెంచరీలతో 197 స్ట్రుక్‌రేట్‌తో 517కు పైగా పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివరిసారిగా 2023లో భారత్ తరపున టీ20 ఆడిన ఇషాన్ తర్వాత పేలవ ఫామ్‌తోనే జట్టుకు దూరమయ్యాడు.
దేశవాళీ క్రికెట్‌లో ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలు పాటించకపోవడంతో సెంట్రల్ కాం ట్రాక్ట్ కూడా కోల్పోయాడు. అయితే గత ఆరు నెలలుగా దేశవాళీ క్రికెట్‌లో మళ్లీ ఫామ్ అందుకుని టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇషాన్ ఓపెనర్‌గానూ ఉపయోగపడతాడన్న కారణం కూడా అతన్ని తీసుకోవడంలో కీలకంగా మారింది. స్పిన్ ఆల్ రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఎంపికయ్యారు. గిల్‌పై వేటు పడడంతో అక్షర్ పటేల్ కు వైస్ కెప్టె న్సీ అప్పగించారు.
ప్రధాన స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరు ణ్ చక్రవర్తి చోటు దక్కించుకున్నారు. సౌతాఫ్రికాతో సిరీస్‌లో వరుణ్ చక్రవర్తి అదరగొట్టాడు. 10 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. అటు పేస్ విభాగంలో బుమ్రా, అర్ష దీప్ లతో పాటు హర్షిత్ రాణాకు చోటు దక్కింది. ఇదిలా ఉంటే వరల్ కప్‌కు ముందు జరిగే కివీస్‌తో సిరీస్ లో నూ ఇదే జట్టు ఆడుతుంది. న్యూజిలాండ్‌తో ఐదు టీ ట్వంటీల సిరీస్ జనవరి 21 నుంచి మొదలవుతుంది.
ఇదిలా ఉంటే టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకూ జరుగుతుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో ఈ సారి 20 జట్లు పోటీ పడుతున్నాయి. టీమిండియా తన తొలి మ్యాచ్‌లో యూఏఈతో ఫిబ్రవరి 7న తలపడుతుంది. టోర్నీలో హైవోల్టే జ్ మ్యాచ్‌గా భావిస్తున్న ఇండియా,-పాక్ మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరుగుతుంది. కాగా భారత్, పాకిస్తాన్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ ఒకే గ్రూపులో ఉన్నాయి.
టీ20 ప్రపంచకప్‌కు భారత్ జట్టు
సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి , వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్(కీపర్)
టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ షెడ్యూల్
ఫిబ్రవరి 7 : భారత్ X యూఎస్‌ఏ (వేదిక : ముంబై)
ఫిబ్రవరి 12 : భారత్ X నమీబియా (వేదిక : ఢిల్లీ )
ఫిబ్రవరి 15 : భారత్ X పాకిస్తాన్ (వేదిక : కొలంబో)
ఫిబ్రవరి 18 : భారత్ X నెదర్లాండ్స్ (వేదిక : అహ్మదాబాద్)