19-05-2025 01:07:34 AM
రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దీన్ని లవ్‌స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ ఓ పాట కూడా పాడారు. అంతేకాదు ‘పుష్ప2’ ప్రమోషన్స్‌లో సుకుమార్ ఈ సినిమా గురించి చెప్తూ.. రష్మిక చాలా అద్భుతమైన ప్రతిభ కనబర్చిందని చెప్పారు.
దీంతో ఈ సినిమాపై అందరికీ ఆసక్తి ఏర్పడింది. రష్మిక ఇతర ప్రాజెక్టుల కోసం పనిచేస్తున్న కారణంగానే ఈ సినిమా ఆలస్యమవుతోంది. దీంతో ‘రిలీజ్ గర్ల్‌ఫ్రెండ్’ అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఊపందుకుంది. దీంతో రష్మిక స్పందించింది. “ది గర్ల్‌ఫ్రెండ్’ కోసం ప్రేక్షకులు వేచిచూస్తున్నారు. ఈ ఆలస్యాన్ని నేను అంగీకరిస్తున్నా. అయితే ప్రేక్షకుల ఎదురుచూపులకు దగ్గట్టుగా సినిమా అద్భుతంగా ఉంటుందనైతే నేను కచ్చితంగా చెప్పగలను.
సాధారణంగా మనం పెద్దగా మాట్లాడని కొన్ని అంశాలతో ‘గర్ల్‌ఫ్రెండ్’ సినిమా రూపొందుతోంది. అన్ని పాత్రలూ చాలా బాగుంటాయి. అదే ఈ చిత్రం ప్రత్యేకత. మంచి అవుట్‌పుట్ కోసం డైరెక్టర్ చాలా కష్టపడుతున్నాడు. తాజా ట్రెండింగ్ చూసిన తర్వాత మా టీమ్ పనుల్ని మరింత వేగిరం చేసింది” అని చెప్పుకొచ్చింది రష్మిక. డైరెక్టర్ రాహుల్ కూడా స్పందిస్తూ..
అందరూ కాస్త ఓపికగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ‘గర్ల్‌ఫ్రెండ్’ నుంచి ఓ అప్‌డేట్ ఉంటుందని ఆయన ప్రకటించారు. గీతాఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్న ఈ చిత్రానికి కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం సమకూర్చుతున్నారు.