calender_icon.png 13 November, 2025 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫైనల్లో అమ్మాయిలు

20-11-2024 12:00:00 AM

సెమీస్‌లో జపాన్‌పై భారత్ విజయం

  1. నేడు చైనాతో టైటిల్ పోరు
  2. మహిళల ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీ

రాజ్‌గిర్ (బిహార్):  మహిళల ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ హోదాను నిలుపుకునేందుకు భారత్ అడుగు దూరంలో ఉంది. టోర్నీ ఆరంభం నుంచి వరుస విజయాలతో దూకుడు మీదున్న అమ్మాయిలు సెమీఫైనల్లోనూ అదరగొట్టారు.

మంగళవారం జరిగి న రెండో సెమీఫైనల్లో భారత్ 2-0తో జపాన్‌పై ఘన విజయాన్ని సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారత్ తరఫున వైస్ కెప్టెన్ నవ్‌నీత్ కౌర్ (ఆట 48వ నిమిషంలో), లాలారెసియామి (56వ నిమిషంలో) గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. నేడు జరగనున్న ఫైనల్ పోరులో సలీమా టిటే సేన చైనాతో అమీతుమీ తేల్చుకోనుంది. 

చివరి క్వార్టర్‌లో రెండు గోల్స్

రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో జరిగిన లీగ్ దశలో జపాన్‌ను 0-3తో భారత్ మట్టికరిపించడంతో సెమీస్‌లో సలీమా సేన ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. అయితే మ్యాచ్ ఆరంభం నుంచే జపాన్ భారత్ జోరుకు అడ్డుకట్ట వేయడంతో తొలి మూడు క్వార్టర్లు గోల్స్ లేకుండానే ముగిశాయి. మ్యాచ్‌లో భారత్‌కు 13 పెనాల్టీ కార్నర్‌లు లభించినప్పటికీ కేవలం ఒక్క దానిలో మాత్రమే సఫల మైంది.

గోల్ కోసం ఇరుజట్లు హోరాహోరీగా తలపడడంతో తొలి మూడు క్వార్టర్లు గోల్స్ లేకుండానే ముగిశాయి. అయితే నాలుగో క్వార్టర్‌లో మాత్రం భారత్ కాస్త దూకుడు ప్రదర్శించింది. ఆట 48వ నిమిషంలో వైస్ కెప్టెన్ నవ్‌నీత్ కౌర్ పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్ మలిచి భారత్‌ను 1-0తో ఆధిక్యంలో నిలిపింది.

ఆ తర్వాత మరో 8 నిమి షాల వ్యవధిలో భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను లాలారేసియామి మాత్రం వృథా కానివ్వలేదు. బంతిని నేరుగా గోల్ పోస్ట్‌లోకి తరలించి భారత్‌కు రెండో గోల్ అందించింది. ఆ తర్వాత చివరి నాలుగు నిమిషాల్లో జపాన్‌కు పెనాల్టీ కార్నర్ లభించినప్పటికీ భారత డిఫెండర్లు అడ్డుకోవడంతో ఆ జట్టు కు నిరాశే మిగిలింది.

అంతకముందు జరిగిన తొలి సెమీఫైనల్లో మాజీ చాంపియన్ చైనా 3-1తో మలేషియాను మట్టికరిపించిం ది. మూడో స్థానం కోసం మలేషియా, జపాన్ తలపడనున్నాయి.