20-11-2024 12:00:00 AM
షెంజెన్ (చైనా): భారత స్టార్ షట్లర్ అనుపమ ఉపాధ్యాయ చైనా మాస్టర్స్ సూపర్-750 టోర్నీలో సంచలనం నమో దు చేసింది. షెంజెన్ వేదికగా జరుగుతున్న టోర్నీలో అనుపమ అమెరికాకు చెందిన 15వ ర్యాంకర్ బివెన్ జెంగ్‌కు షాకిచ్చింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో అనుపమ 21-17, 8-21, 22-20తో జెంగ్‌పై అనూహ్య విజయాన్ని అందుకుంది.
48 నిమిషాల పాటు సాగిన పోరులో అనుపమ ఆద్యంతం ఆకట్టుకుంది. తొలి గేమ్‌ను గెలుచుకున్న అనుపమ రెండో గేమ్‌ను ప్రత్యర్థికి కోల్పోయింది. అయితే కీలకమైన మూడో గేమ్‌లో మళ్లీ ఫుంజుకున్న అనుపమ జెంగ్‌తో హోరాహోరీగా తలపడింది. ఒక్కో పాయింట్ కోసం ఇద్దరు తీవ్రంగా పోటీ పడ్డారు. ఒక దశలో 20-20తో సమానంగా నిలిచిన దశలో జెంగ్ అనవసర తప్పిదాలు చేసి ఓటమి పాలవ్వగా.. అనుపమ విజయాన్ని అందుకుంది.
కాగా ఒక బీడబ్ల్యూఎఫ్ సూపర్-750 టోర్నీలో రెండో రౌండ్‌లో అడుగుపెట్టడం అనుపమకు ఇదే తొలిసారి. ఈ ఏడాది కజకిస్థాన్ ఇంటర్నేషనల్ చాలెంజ్‌తో ప ఆటు పాలిష్ ఓపెన్ నెగ్గిన అనుపమ రెండో రౌండ్‌లో జపాన్‌కు చెందిన నట్సుకి నిదాయిరాతో తలపడనుంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో హైదరాబాదీ ద్వయం సుమిత్-సిక్కిరెడ్డి జంట ముందంజ వేసింది.
తొలి రౌండ్‌లో ఈ జోడీ 23-21, 17-21, 21-17తో స్మిత్-జెన్నీ గెయ్ (అమెరికా) జంటపై కష్టపడి విజయం సాధించింది. రెండో రౌండ్‌లో సుమిత్ జోడీ చైనీస్ తైపీకి చెందిన ఫెంగ్ యాన్- హ్యుయాంగ్ డోంగ్‌తో తలపడనుంది.
పురుషుల సింగిల్స్‌లో ప్రియాన్షు రజావత్, మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్‌కే పరిమితమయ్యారు. నేడు జరగనున్న పోటీల్లో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్, డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ బరిలోకి దిగనున్నారు.