31-08-2025 12:00:00 AM
-31 అడుగుల వద్ద వరద ప్రవాహం
-ఆలయానికి మూడు వైపులా నిలిచిన నీరు
-నీటిలోనే 500 కుటుంబాలు
-వేలాది ఎకరాల్లో పంట నష్టం
-42 ఏళ్ల తర్వాత ఇంత భారీ స్థాయిలో వరద
-కాళేశ్వరంలో గోదావరి ఉధృతి
-భద్రాచలం వద్ద 47 అడుగలకు..
నిర్మల్, ఆగస్టు 30 (విజయక్రాంతి): వర్షాలు తగ్గినా ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నిర్మల్ జిల్లాలోని సరస్వతి నిలయం బాసర లో శనివారం కూడా ఉధృతంగా ప్రవహించడంతో బాసర పట్టణంలోని పలు కాలనీ లు నీట మునిగాయి. గోదావరి నది ఎగువ ప్రాంతంలో మహారాష్ర్టలోని విష్ణుపురి గైక్వాడ్ నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ పోచంపల్లి డ్యాముల నుంచి రికార్డు స్థాయిలో వరద రావడంతో బాసర వద్ద గోదావరి 31 అడుగులను మించి ప్రవహిస్తున్నది.
బాసర వద్ద రైల్వే లైన్, నిజాంబా ద్‌బైంసా నేషనల్ హైవే బ్రిడ్జిని ఆనుకొని గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. బాసర సరస్వతి అమ్మవారి ఆలయం మూడువైపులా నీరు నిలిచిపోయింది. ఆలయం వరకు ఉన్న ప్రధాన రహదారిపై మూడు అడుగుల నీరు నిలిచిపోవడంతో రాకపోకలను నిషేధించారు. ఒడ్డున గల క్యాటజీలు మునిగిపోగా పడవలు కొట్టుకుపోయాయి. బాసర, నిజామాబాద్‌కు తాగు నీరు అందించే పంప్‌లైన్లు బాసర గోదావరిలో మునిగిపోవడంతో తాగునీటికి ఇబ్బం ది కలుగుతున్నది. బాసర అమ్మవారి ఆల యం చుట్టూ ఉన్న సుమారు 1000 ఇండ్లు నీటిలోనే రెండు రోజులుగా ఉన్నాయి. బాస ర ఆలయం వద్ద ఉన్న ఎస్బిఐ బ్రాంచీ, 15 లాడ్జిలు, 300 వ్యాపార దుకాణాలు నీటిలో మునిగాయి.
శనివారం మధ్యాహ్నం ఓ భవనంలో నలుగురు చిక్కుకోగా ఎన్ టీఆర్‌ఎస్ సిబ్బంది వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇండ్ల చుట్టూ వరద చేరుకోవ డంతో ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేక సహాయం కోసం ఎన్టీఆర్ సిబ్బందిని ఆశ్రయిస్తున్నారు. ఎన్డీఆర్ సిబ్బంది వారికి తెప్ప లపై ఆహార పొట్లాలు, మందులు, వాటర్ క్యాన్లు, నిత్యావసర సరుకులను సరఫరా చేస్తున్నారు. రైల్వే లైన్ వైపు వరద దూసుకురావడంతో పట్టాలపై ఉన్న మట్టి తొలగి వరదనీరు పంటపొలాలకు వెళుతున్నది.
బాసర వద్ద సుమారు నాలుగున్నర లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. బాసర చరిత్రలో 1983లో వచ్చిన వరదల కంటే ఈ వరదలు ఎక్కువని స్థానికులు చెపుతున్నారు. శ్రీరాంసాగర్ దిగువ ఉన్న సోను, లక్ష్మణ్ చందా, ఖానాపూర్, మామడ మండలంలోని సుమారు 8 గ్రామాలు బిక్కుబిక్కుమం టూ కాలం వెల్లదిస్తున్నాయి. నష్టపోయిన రైతులను, బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని కలెక్టర్ అభిలాష అభినవ్, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ భరోసా కల్పించారు. శనివారం బాసర పట్టణంలో కలెక్టర్ పర్యటించారు.
నీటిలో వేలాది ఎకరాల పంటలు
బాసర గోదావరి నది పరివాహక ప్రాం తంలో రైతులు సాగు చేసిన వేలాది ఎకరా ల్లో పంటలు నీట మునిగాయి. బాసర, బెదిరి పోనీ, కౌటా, సాలాపూర్, పంచకూడా మౌలా, అబ్దుల్లాపూర్, కాన్కాపూర్, గడిచిం దా, రాజుర, పొట్టి పెళ్లి, నరసాపూర్ గుండంపెల్లి, దిల్వార్పూర్ గ్రామాల్లో సుమారు 3000 ఎకరాల్లో పత్తి, సోయా, మొక్కజొ న్న, వరి పంటలు శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్‌లో మునిగాయి. ఇదిలా ఉండగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 4.71లక్షలు వస్తుం డగా 39 గేట్ల ద్వారా 5.70 లక్షల క్యూసెక్కులను గోదావరిలోకి వదులుతున్నారు.
బడిలో చిక్కుకున్న 36 మంది పిల్లలు
నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయ సమీపంలో ఉన్న నాగభూషణం ప్రవేట్ పాఠశాలకు చెందిన 36 మంది విద్యార్థులు, నలుగురు టీచర్లు వరదల్లో చిక్కుకున్నారు. వారిని శనివారం సాయంత్రం ఎన్టీఆర్‌ఎఫ్ సిబ్బంది కాపాడారు. పాఠశాలలోకి ఒక్కసారిగా నీరు రావడంతో హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులు ఆందోళన చెందగా పాఠశాల సిబ్బంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందికి సమాచా రం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది పిల్లలను, టీచ ర్లను బయటకు తీసుకొచ్చారు.
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
కొత్తపల్లి(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా చింతకుంట శివారులోని ఎస్‌ఆర్‌ఎస్‌పి కెనాల్‌లో చేపల వేటకు వెళ్లిన వ్యక్తి.. ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతిచెందాడు. ఉత్తరప్రదేశ్ రాష్టానికి చెందిన రహమాన్ కరీంనగర్‌కు ఉపాధి నిమిత్తం వచ్చి, కాశ్మీర్ గడ్డలో నివాసం ఉంటున్నాడు. స్నేహితులతో కలిసి చింతకుంట గ్రామ శివారులోని ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువ వద్ద చేపలు పడుతుండగా నీటి ప్రవాహం ఎక్కువ అయ్యి కాలువలో జారి పడిపోయాడు. పోలీసులు, గజ ఈతగళ్ల సహాయంతో వెతకగా శనివారం మృతదేహం లభ్యమైంది.
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి
భద్రాచలం(విజయక్రాంతి): భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులకు చేరుకున్న నీటిమట్టం క్రమేనా పెరుగుతూ శనివారం సాయం త్రం 6 గంటలకు 47.40 అడుగులకు చేరుకున్నది. అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయటానికి ఇంకా ఆరు పాయింట్లు (48 అడుగులకు) దిగువన ఉంది.
భద్రాచలం ఎగువన పేరూరు వద్ద గోదావరి నది శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు 16.740 మీటర్ల వద్ద స్థిరంగా ఉండి మరల మరో పది పాయింట్లు పెరిగి ఏడు గంటలకు 16.760 మీటర్లకు చేరుకొని ఇంకా పెరుగుతూ ఉన్నది. భద్రాచలం వద్ద మరో సారి పెరిగే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. వరద పెరగడంతో భద్రాచలం, పినపాక నియోజకవర్గంలోని గోదావరి నది కిరువైపులా ఉన్న అనేక పొలాలు నీటిలో మునిగిపోయా యి. భద్రాచలం చర్ల రహదారిపై కూడా కొన్నిచోట్ల గోదావరి బ్యాక్ వాటర్ రోడ్డును ముంచెత్తుతున్నది.
బ్యారేజీల వద్ద గోదావరి ఉగ్రరూపం
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్)(విజయక్రాంతి): జయశంకర్ భూపా లపల్లి జిల్లా కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. అన్నారం ప్రాజెక్టు వద్ద వరద ప్రవా హం శనివారం ఉద యం 8,46,552 క్యూసెక్కుల వరకు ఉండగా, సుందిళ్ల బ్యారేజీ నుంచి 9,27,482 క్యూసెక్కులు, శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి 7,60,892 క్యూసె క్కుల నీరు దిగువకు వెళుతోంది.
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వద్ద శనివారం సాయం త్రం 10,25,600 క్యూసెక్కుల వరద ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. కాళేశ్వరం వద్ద 9 గంటల వ్యవధిలో 35 వేల క్యూసెక్కుల వరద పెరిగిందన్నారు. సాయంత్రం 5 గంట ల వరకు 12.550 మీటర్ల ఎత్తులో గోదావరి నది ప్రవహిస్తోందని, మొదటి ప్రమాద హెచ్చరిక 12.210 మీటర్లు కాగా, 13.460 మీటర్ల మేర ప్రవహించడంతో ప్రమాద హెచ్చరికగా అధికారులు ప్రకటించారు.