25-04-2024 01:34:28 AM
రూ.490 పెరుగుదల
హైదరాబాద్, ఏప్రిల్ 24: వరుసగా రెండు రోజులు పడిపోయిన బంగారం ధర బుధవారం స్వల్పంగా కోలుకున్నది. ప్రపంచ మార్కెట్ సంకేతాలకు అనుగుణంగా హైదరాబాద్ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.490 మేర పెరిగి రూ.72,650 వద్దకు చేరింది. ఇది వరుస రెండు రోజుల్లో 2,080 మేర తగ్గిన సంగతి తెలిసిందే. అలాగే గత వారాంతంలో నగరంలో ఈ ధర రూ.74,340 వద్దకు చేరి కొత్త రికార్డును సృష్టించిన సంగతీ విదితమే.
తాజాగా 22 క్యారట్ల పుత్తడి తులం ధర రూ.450 పెరిగి రూ. 66,600 వద్ద పలుకుతున్నది. ఇది రెండు రోజుల్లో రూ.1,900పైగా తగ్గింది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ఫ్యూచర్స్ ధర 2,310 డాలర్ల కనిష్ఠస్థాయి నుంచి 2,330 డాలర్లకు పుంజుకున్న కారణంగా స్ఠానికంగా ధర పెరిగిందని బులియన్ ట్రేడర్లు చెప్పారు. అయితే వెండి ధర మాత్రం మరికొంత తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర ఒక్కరోజులోనే రూ.100 తగ్గి రూ.86,400 స్థాయికి దిగివచ్చింది. వెండి ధర మంగళవారం రూ.2,500 తగ్గిన విషయం తెలిసిందే.