calender_icon.png 2 January, 2026 | 9:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాక్సిస్ బ్యాంక్ నికరలాభం రూ.7,130 కోట్లు

25-04-2024 01:32:51 AM

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ స్టాండెలోన్ నికరాభం 2024 మార్చి త్రైమాసికంలో (క్యూ4) 2023 డిసెంబర్ క్వార్టర్‌తో (క్యూ3) పోలిస్తే 17 శాతం వృద్ధిచెంది రూ. 6,071 కోట్ల నుంచి రూ.7,130 కోట్లకు చేరింది. గత ఏడాది క్యూ4లో బ్యాంక్ రూ. 5,728 కోట్ల నికరనష్టం చవిచూసింది. సమీక్షా త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 11 శాతం పెరిగి రూ. 13,089 కోట్లకు చేరినట్టు యాక్సిస్ బ్యాంక్  స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. బుధవారం సమావేశమైన బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.1 చొప్పున తుది డివిడెండును సిఫార్సుచేసింది. 4.06 శాతం నికర వడ్డీ మార్జిన్ సాధించినట్టు తెలిపింది. బ్యాంక్ ఫీజు ఆదాయం త్రైమాసికంవారీగా 23 శాతం పెరిగి రూ.5,637 కోట్లకు చేరగా, రిటైల్ ఫీజు ఆదాయం 33 శాతం వృద్ధిచెందింది. బ్యాంక్ మొత్తం ఫీజు ఆదాయంలో 74 శాతం రిటైల్ బ్యాంకింగ్ ద్వారానే సమకూరడం గమనార్హం.

రూ. 919 కోట్లు రికవరీ

యాక్సిస్ బ్యాంక్ స్థూల మొండి బకాయిలు మార్చి త్రైమాసికంలో క్యూ3తో పోలిస్తే 1.58 శాతం నుంచి 1.43 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు 0.36 శాతం నుంచి 0.31 శాతానికి చేరాయి. గతంలో రైటాఫ్ చేసిన ఖాతాల నుంచి క్యూ4లో రూ.919 కోట్లు రికవరీ చేసినట్టు బ్యాంక్ తెలిపింది. అలాగే సమీక్షా త్రైమాసికంలో రూ.2,082 కోట్ల ఎన్‌పీఏలను రైటాఫ్ చేసినట్టు యాక్సిస్ పేర్కొంది.

రూ.55,000 కోట్ల నిధుల సమీకరణ

దేశీయ/విదేశీ కరెన్సీ రూపంలో దీర్ఘకాలిక బాండ్లు, మసాలా బాండ్లు, ఈసీజీ బాండ్లు, కన్వర్ట్‌బుల్, నాన్ డిబెంచర్లు, ఇన్‌ఫ్రా బాండ్లు తదితర డెట్ పత్రాల జారీ ద్వారా రూ.55,000 కోట్ల నిధుల సమీకరణకు యాక్సిస్ బ్యాంక్ బోర్డు ఆమోదం తెలిపింది.