25-04-2024 01:38:11 AM
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: దేశం నుంచి ఫార్మాస్యూటికల్ ఎగుమతులు 2023 ఆర్థిక సంవత్సరంలో 9.67 శాతం వృద్ధిచెంది 27.9 బిలియన్ డాలర్లకు చేరినట్టు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో ఫార్మా ఎగుమతులు 12.73 శాతం వృద్ధితో 2.8 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భార త్ నుంచి ఫార్మా ఎగుమతులు అధికంగా యూఎస్, యూకే, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాలకు జరిగాయి.
భారత్ ఫార్మా ఎగుమతుల్లో 31 శాతం అమెరికాకు చేరగా, 3 శాతం చొప్పున యూకే, నెదర్లాండ్స్‌కు జరిగాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా కొన్ని దేశాలకు ఫార్మా ఎగు మతులు జరిపినట్టు వాణిజ్య శాఖ వివరించింది. అందులో మోంటెనెగ్రో, దక్షిణ సూడాన్, చాద్, కొమోరోస్, బ్రూనె, లాట్వి యా, ఐర్లాండ్, స్వీడన్, హైతి, ఇథియోపియాలు ఉన్నాయి.
2030 కల్లా 130 బిలియన్ డాలర్లకు..
మార్కెట్ అవకాశాలు పెరగడం, యూఎస్ తదితర దేశాల నుంచి డిమాండ్ బాగుండటంతో ఏ నెలకు ఆ నెల ఎగుమతులు వృద్ధిచెందుతున్నట్టు పరిశ్రమ నిపుణుడు ఒకరు చెప్పారు. 2030వ సంవత్సరానికల్లా భారత్ ఫార్మాస్యూటికల్ వాణిజ్యం ఎగుమతులతో కలుపుకుని 130 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు నిపుణులు చెప్పారు. 2022 భారత్ ఫార్మా పరిశ్రమ 50 బిలియన్ డాలర్ల వాణిజ్యం సాగించింది.
విదేశీ మార్కెట్లలో ఫార్మా ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా మార్కెట్ అవకాశాలు విస్తరిస్తున్నాయన్నారు. భారత్ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ ప్రపంచంలోకెల్లా పరిమాణం రీత్యా మూడో స్థానంలో, విలువ రీత్యా 13వ స్థానంలో ఉన్నది. దాదాపు 60 థెరపుటిక్ క్యాటగిరీలలో 60,000 జెనరిక్ డ్రగ్స్‌ను తయారు చేస్తున్నది. ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, జెనరిక్ మెడిసిన్స్ దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు ప్రొడెక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) స్కీమ్‌లను ప్రవేశపెట్టింది.