28-01-2026 12:00:00 AM
మొయినాబాద్, జనవరి 27 (విజయక్రాంతి): న్యాయవాద వృత్తిలో ఉంటూనే ప్రజాసేవపై ఉన్న మక్కువతో చేవెళ్ల కోర్టు ప్రభుత్వ అసిస్టెంట్ ప్లీడర్ గీతా వనజాక్షి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా పోటీ చేసేందుకు ఆమె తన పదవికి రాజీనామా చేశారు.
న్యాయస్థానం నుండి ప్రజాక్షేత్రంలోకి
మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమంగారం కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న ఆమె మంగళవారం తన రాజీనామా పత్రాన్ని చేవెళ్ల కోర్టు న్యాయమూర్తికి సమర్పించారు. ప్రభుత్వ అసిస్టెంట్ ప్లీడర్గా తనకు అప్పగించిన బాధ్యతలను ఇప్పటివరకు అత్యంత నిబద్ధతతో, సమర్థవంతంగా నిర్వహించానని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు.
రాజీనామాకు కారణం ఇదే
కేవలం పదవుల కోసం కాకుండా, ప్రజలకు మరింత చేరువగా ఉండి సేవ చేయాలనే ఆశయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గీతా వనజాక్షి తెలిపారు. గతంలో ఆమె పెద్దమంగారం గ్రామ సర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉంది. సర్పంచ్గా తాను చేసిన అభివృద్ధి పనులను గుర్తించి, గ్రామస్థులు అందిస్తున్న ప్రోత్సాహంతోనే మళ్ళీ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించారు. ప్రజల ఆదరణ తనపై ఎప్పుడూ ఉంటుందని, కౌన్సిలర్గా ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.న్యాయవాదిగా కోర్టులో వాదనలు వినిపించిన గీతా వనజాక్షి, ఇప్పుడు ప్రజా సమస్యలపై గళం విప్పేందుకు సిద్ధమవ్వడం చర్చనీయాంశమైంది.