06-12-2025 01:10:47 AM
రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి బాధ్యత వహించాలి
స్థానిక ఎన్నికల ప్రక్రియను నిలిపివేయండి
-మృతుడి కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి
-నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
-బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపు
-ఆత్మబలిదానంపై పెల్లుబికిన ఆగ్రహం
-గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.. రణరంగం
-తీన్మార్ మల్లన్న, జాజులతో సహా పలువురి అరెస్ట్
హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 5 (విజయక్రాంతి): సాయి ఈశ్వరాచారి మృతికి ముమ్మాటికీ కాంగ్రెస్, బీజేపీ పార్టీలే కారణమని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. అంతకుముందు ఈశ్వరాచారి శుక్రవారం తెల్లవారుజామున గాంధీ ఆసుపత్రిలో కన్నుమూయడంతో బీసీ లోకం భగ్గుమంది.
ఈశ్వర్ మృతదేహాన్ని సందర్శిం చేందుకు, కుటుంబానికి అండగా నిలిచేందుకు బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్‌తో సహా బీసీ సం ఘాల నేతలు, కార్యకర్తలు వందలాదిగా గాంధీ ఆస్పత్రికి పోటెత్తడంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి గాంధీ ఆస్పత్రి మార్చురీ పలువురు నేతలు బైఠాయించి ఆందోళన చేప ట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులపై జులుం ప్రదర్శించి ఉక్కుపాదం మోపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వందలాది మంది కార్యకర్తలను, ముఖ్య నేతలను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ వాహనాల్లోకి ఎక్కించారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ బృందాన్ని తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తీన్మార్ మల్లన్నను, ఇతర ముఖ్య నేతలను వేర్వేరు ఠాణాలకు తీసుకెళ్లారు. మిగిలిన కార్యకర్తలను నగరంలోని బొల్లారం, అంబర్‌పేట, ఉప్పల్ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు.
రిజర్వేషన్లలో అన్యాయం చేసినందుకే..
ఈ ఘటనపై పోలీస్‌స్టేషన్ నుంచే జాజుల శ్రీనివాస్‌గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘42% రిజర్వేషన్ల విషయంలో అన్యాయం చేసినందుకే సాయి ఈశ్వర్ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ముమ్మాటికీ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చేసిన హత్యే. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యత వహించాలి’ అని డిమాండ్ చేశారు. రెండు పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయని, రిజర్వేషన్ల విషయంలో మోసం చేస్తున్నాయని మండిపడ్డారు.
కాంగ్రెస్, బీజేపీల్లో కొనసాగుతున్న బీసీ నేతలకు జాజుల అల్టిమేటం జారీ చేశారు. మీకు చిత్తశుద్ధి ఉంటే, సాయి ఈశ్వర్ త్యాగానికి విలువ ఇస్తే.. తక్షణమే మీ పదవులకు రాజీనామా చేసి బయటకు రండి.. లేనిపక్షంలో ప్రజలే మీకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సాయి ఈశ్వర్ బలిదానంతోనైనా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు దిగిరావాలని, లేదంటే ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుందని హెచ్చరించారు.
స్థానిక ఎన్నికలను నిలిపివేయాలి..
ఈ ఘటనకు నిరసనగా శనివారం రాష్ర్టవ్యాప్తంగా నిరసనలు, రాస్తారోకోలు చేపట్టాలని బీసీ యువతకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘సాయి ఈశ్వర్ చారి మృతిపై ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో చర్చ జరగాలన్నారు. ఇదే సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదించాలని, బీసీలకు న్యాయం చేయకుండా, 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా నిర్వహిస్తున్న సర్పంచ్, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
మృతుడి కుటుంబానికి రాష్ర్ట ప్రభుత్వం తక్షణమే రూ. కోటి ఎక్స్ గ్రేషియా విడుదల చేసి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఈ ఘటనపై రాష్ర్టంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని, బీసీ ద్రోహులైన కాంగ్రెస్, బీజేపీ నాయకుల ఇళ్లను ముట్టడించి నిలదీయాలి’ అని జాజుల పిలుపునిచ్చారు.