calender_icon.png 6 December, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బలిదానం వద్దు.. బరిగీసి కొట్లాడుదాం

06-12-2025 01:08:15 AM

తెలంగాణను మళ్లీ బలిదానాల గడ్డగా మార్చొద్దు

సాయి ఈశ్వరాచారి మరణం వృథాపోదు

స్థానికంలో ఆ పార్టీలను ఓడించాల

-హిస్సా, ఇజ్జత్, హుకుమత్‌ల కోసం కలిసి పోరాడుదాం 

-బీసీల పట్ల కాంగ్రెస్ వంచన.. రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం 

-‘విజయక్రాంతి’తో బీసీ మేధావుల ఫోరం చైర్మన్ చిరంజీవులు

హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): ‘వీరుల మరణాలు ఎప్పుడూ వృథా కావు. ఆనాడు శ్రీకాంతాచారి ఆత్మహత్యతో తెలంగాణ ఉద్యమం ఉధృ తం అయింది. ప్రత్యేక రాష్ట్ర సాధన కల సాకారం అయింది. అదేవిధంగా సాయి ఈశ్వరాచారి మరణం కూడా బీసీ ఉద్యమానికి కచ్చితంగా ఊతమిస్తుంది. బీసీ ఉద్యమం మళ్లీ ఉవ్వెత్తున లేస్తుంది. తెలంగాణలో రాబోయే కాలంలో బీసీల రాజ్యాధికారం వచ్చి తీరుతుంది. ఇప్పటికైనా బీసీలు మేల్కోనాలి.

మన లక్ష్యం సాధించాలంటే మనం బలంగా, చైతన్యంగా, ఒకటిగా నిలబడాలి. సాయి ఈశ్వరాచారి మరణం మనందరికీ ఒక గట్టి హెచ్చరిక. ఇకపై ఎవరూ ఇలాంటి చర్యలు చేయొద్దు. మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉంది. అది మన ఓటు ద్వారా, మన ఆత్మగౌరవం ద్వారా, మన పోరాటం ద్వారా నిర్మితమవుతుంది. హిస్సా, ఇజ్జత్, హుకుమత్‌ల కోసం అందరం కలిసి పోరాడుదాం. అధిపత్య కులాల దోపిడీకి ఘోరీ కట్టుదాం. మన హక్కుల కోసం మనం వేడుకోవటం కాదు, పోరాటం ద్వారా సాధించుకుందాం.

మన మహనీయులు ఫూలే, అంబేడ్కర్, కాన్షీరాం చూపిన మార్గంలో నడుద్దాం. మన ఆశయాన్ని సాధిద్దాం. ఓటు ద్వారానే ఆధిపత్య కులాలకు చెక్ పెట్టాలి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో బహుజన అభ్యర్థులకే ఓటేయండి. అప్పుడే రాబోయే కాలంలో రాజ్యాధికారం బీసీల చేతుల్లోకి నడుచుకుంటూ వస్తుంది’ అని బీసీ మేధావువల ఫోరం చైర్మన్ టీ చిరంజీవులు అన్నారు. ఈ నేపథ్యం లో ‘విజయక్రాంతి’ దినపత్రిక ద్వారా స్పందించిన చిరంజీవులు.. బీసీ సమాజానికి పిలుపునిచ్చారు. 

బీసీలను వంచించిన ప్రభుత్వాలు

బీసీలను ప్రభుత్వాలు వంచిస్తున్నాయి. బీసీలేం సీఎం కుర్చీ అడగలేదు. ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు అడగలేదు. 42 శాతం రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా తమకు రావాల్సిన దానిని అమలు చేయాలని కోరుతు న్నా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలు తక్షణమే పార్లమెంట్‌లో 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు బిల్లు ప్రవేశపెట్టండి. లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు ఇంకా 14 రోజుల సమ యం ఉంది. రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించేందుకు ప్రధానిని కలిశారు. మరి బీసీ బిల్లు గురించి ఎందుకు మాట్లాడలేదు. మళ్లీ 42 శాతం రిజర్వేషన్‌కు తాము కట్టుబడి ఉన్నామని, సామాజిక న్యాయానికి అడ్రస్ అని ఎందుకు చెబుతున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ను కూడా కోరుతున్నాం. మీరు ఇంకా గుహలో పడుకుని చూసేంత సమయం లేదు. బీసీలతో కలిసి పోరాటం చేయాలని కోరుతున్నాం. 

రిజర్వేషన్ ఇవ్వాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేదు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదు. బీసీలను మభ్యపెట్టి, బీసీ ఓట్లతో రాజ్యాధికారంలో వచ్చారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో 21 హామీలిస్తే ఒక్క హామీ కూడా అమలు చేయని ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. కాంగ్రెస్ అంతా ఆధిపత్య కులాల పాలనలో ఉన్న పార్టీ. వారి వర్గాల ప్రాధాన్యతలను కాపాడాలనే ఆలోచనే ఉంటుంది తప్ప బీసీలపై ఉండదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తన వైఖరి మార్చుకోకపోతే రాబోయే కాలంలో మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉందో అదే పరిస్థితి తెలంగాణలో కూడా వస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా బంద్ నిర్వహించాలి. రైల్ రోకోలు చేపట్టాలి. ప్రభుత్వాలను కదిలించాలి.