20-09-2025 08:41:23 PM
మాజీ మంత్రి జోగు రామన్న..
అదిలాబాద్ (విజయక్రాంతి): రైతులకు అందాల్సిన యూరియాపై స్థానిక బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు కేంద్రంపై ఒత్తిడి పెంచకుండా కాంగ్రెస్ ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తడం పరిపాటిగా మారిందని మాజీ మంత్రి జోగు రామన్న(Former Minister Jogu Ramanna) అన్నారు. బేల మండలం దోప్టాల పంచాయతీ పరిధిలోని రంకం గ్రామానికి చెందిన కోడిమెత మాధవరావు అనే రైతుని స్థానిక పోలీసులు ఇబ్బందులకు గురి చేయడంపై మాజీ మంత్రి జోగు రామన్న స్పందిస్తూ శనివారం కోడిమెత మాధవ రావుతో పాటు రైతులను కలిసి పరామర్శించారు. యూరియా పంపిణీలో మాధవరావుపై జరిగిన దౌర్జన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. రైతులు అధైర్య పడవద్దు అని ధైర్యం కల్పించారు.
యూరియా పంపిణీలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై స్థానికులు జోగు రామన్నతో ఆవేదన వెళ్లగక్కారు. జోగు రామన్న మాట్లాడుతూ యూరియా పంపిణీలో పోలీసులు టోకన్లు పంపిణీ చేయడంపై మండిపడ్డారు. వ్యవసాయ అధికారులతో పాటు పోలీసులు రైతు కుటుంబం నుండే వచ్చి నిధులు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. రైతుల పట్ల మర్యాదగా నడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యూరియా పంపిణీలో పోలీసుల వ్యవహారంపై జిల్లా ఎస్పీని వివరిస్తామన్నారు. రైతుల పక్షాన మరోసారి బీ.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలతో పాటు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రౌతు మనోహర్, ప్రమోద్ రెడ్డి, సతీష్ పవర్, తేజో రావు, విశాల్, విపిన్, విట్టల్, జితేందర్, దేవదాస్, రాజు, తదితరులు పాల్గొన్నారు.